
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు భారీ స్థాయిలో చేపట్టామని, రికార్డు స్థాయిలో 75 లక్షల మంది ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పడ్డాక తెరాస సభ్యత్వం 51 లక్షలుగా ఉందని, ప్రస్తుతం తెరాస సభ్యత్వ నమోదు 75లక్షలు దాటిందన్నారు. సభ్యత్వ రుసుము కింద రూ.25 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే వచ్చిన మొత్తాన్ని పార్టీ ఖాతాలో జమ చేశామని వెల్లడించారు.
ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే టీఆర్ఎస్ వార్షికోత్సవసభకు భారీ స్థాయిలో కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు. దీ నికంటే ముందు ఈనెల 21న కొంపల్లిలో ప్లీనరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
సభకు వచ్చే కార్యకర్తలు కూలీ పనులు చేసి బువ్వకు తోవకు సరిపడా డబ్బులు సంపాదించాలన్నారు. ఇందుకోసం ఈనెల 14 నుంచి 20 వరకు గులాబీ కూలీ దినాలుగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.