
మాయా లేదు... మంత్రం లేదు అంతా చెంబు మహిమ ... ఈ చెంబు మీ చెంత ఉంటే మీకు చింతే లేదు... ఒకటి రెండు అవుతుంది రెండు నాలుగవుతుంది...కావాలంటే ఈ చెంబు లీలలు చూడండి....అంటూ నగరంలో కొత్త తరహాలో దోపిడీ దొంగలు వీరంగం సృష్టిస్తున్నారు.
కోటిశ్వరుల ఇళ్లే టార్గెట్ గా వారి అత్యాశే పెట్టుబడిగా హైదరాబాద్ లో కొందరు కేటుగాళ్లు తెలివైన మోసాలకు పాల్పడుతున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో రాత్రికి రాత్రే కోట్లు కొల్లగొట్టి ఉడాయిస్తున్నారు. వారి మాయలో పడి అమాయకులు ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు.
ఇంతకీ కేటుగాళ్లు చెంబుతో ఎలా మోసం చేస్తున్నారో తెలుసా...
రైస్ పుల్లింగ్ అనే ఓ ఫేక్ కాన్సెప్ట్ తో... ఇరిడియం అనే అరుదైన మూలకం కలిగిన చెంబు మా దగ్గర ఉందని దానికి బియ్యాన్ని ఆకర్షించే గుణం ఉందని ఈ చెంబు దొంగలు కోటీశ్వరులను ఆకర్షిస్తున్నారు.
వారు నమ్మకపోతే ఇలా వారి ముందే రైస్ పుల్లింగ్ టెస్ట్ చేసి వారిని మాయలో పడేస్తున్నారు. ఈ చెంబు చాలా ఖరీదైందని విదేశీ మార్కెట్ లో కోట్లు విలువ చేస్తుందని నమ్మిస్తుంటారు. తామైతే దీన్ని చాలా తక్కువకే అమ్ముతామని ఆఫర్ ఇస్తుంటారు.
ఈ ఆఫర్ కు పడిపోయి కేటుగాళ్లకు కోట్లు కుమ్మరిస్తున్నారు కొందరు అమాయకులు. పోనీ అది నిజంగా ఇరిడియంతో చేసిన చెంబా అంటే అదీ కాదు.. అసలు ఇండియాలో ఇరిడియం దొరకనే దొరకదు.
పాతబడిపోయిన రాగి చెంబును ఇరిడియంగా చూపించి లోపల ఆయస్కాంతం పెట్టి బియ్యాన్ని ఆకర్షించేలా మ్యాజిక్ ట్రిక్స్ ప్లే చేస్తూ కేటుగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతున్నారు.ఇలా మోసపోయిన వాళ్లు నగరంలో పదుల సంఖ్యలోనే ఉన్నట్లు తెలుస్తోంది.