
రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగిలో పండించిన జొన్న పంటకు మద్ధతు ధర చెల్లించి.. రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం మార్క్ ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 యాసంగి సీజన్‌లో పండించిన దాదాపు 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.219.92 కోట్ల మొత్తానికి తెలంగాణ సర్కార్ బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వనుంది. కేసీఆర్ నిర్ణయం వల్ల దాదాపు లక్షమంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా.
ఇకపోతే.. అకాల వర్షాలతో అల్లాడుతున్న రైతాంగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసా కల్పించిన సంగతి తెలిసిందే. గత వారం రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, పంటనష్టం తదితర అంశాలపై అధికారులు, మంత్రులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దీనికి కూడా సాధారణ వరికి చెల్లించే ధరనే చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరి కోతలు 3, 4 రోజులు వాయిదా వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. రైతులు ప్రతి యేటా మార్చిలోగా యాసంగి వరికోతలు పూర్తి చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. వ్యవసాయ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. అలాగే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని సీఎస్ కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు