సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చర్చలు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో లెఫ్ట్, బీఎస్పీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవాలని భావిస్తుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తుంది. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. మరో వైపు లెఫ్ట్ పార్టీలతో పాటు బీఎస్పీని కూడ తమ కూటమిలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం యోచిస్తుంది.ఈ విషయమై ఆ పార్టీలతో కాంగ్రెస్ నేతలు చర్చిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు లెఫ్ట్, బీఎస్పీ పార్టీలతో చర్చించే బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ నాయకత్వం.
సీపీఐ, సీపీఎం నేతలతో కాంగ్రెస్ నేతలు చర్చించారు. రెండు పార్టీలకు రెండేసీ సీట్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉంది. అయితే లెఫ్ట్ పార్టీలు కోరుతున్న సీట్ల విషయంలో కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందులున్నాయి. సీపీఐ నాయకత్వం కొత్తగూడెం, సీపీఎం నాయకత్వం పాలేరు సీట్ల విషయంలో పట్టుదలతో ఉన్నాయని సమాచారం. అయితే ఈ విషయాలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే బీఎస్పీకి కూడ ఒక్క సీటును కాంగ్రెస్ పార్టీ కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ తో పొత్తులు కుదరకపోతే తాము పోటీ చేసే స్థానాల జాబితాను సీపీఐ, సీపీఎంలు అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉంది.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని సీపీఐ, సీపీఎంలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే ఏం చేయాలనే దానిపై కూడ ఈ రెండు పార్టీలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయి.మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. అయితే గత నెలలో బీఆర్ఎస్ 115 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ పరిణామంతో కేసీఆర్ తీరుపై లెఫ్ట్ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ పరిణామాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రారంభించింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తుకు కాంగ్రెస్ పార్టీ స్నేహ హస్తం చాపింది. సీపీఐ, సీపీఎం నేతలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే ఇప్పటికే చర్చలు జరిపిన విషయం తెలిసిందే.