జీవో 111 ఎత్తివేతతో రైతులకు ఉపయోగం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు.
మహబూబ్ నగర్: జీవో 111 ఎత్తివేత వెనుక పెద్ద భూకుంభకోణం ఉందని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. సోమవారంనాడు మహబూబ్ నగర్ జి్లాలో మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రియల్టర్ల కోసమే 111 జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిందని ఆయన ఆరోపించారు. జీవో 111 ఎత్తివేత తో రైతులకు ఒరిగేదేమీ లేదన్నారు.
జీవో 111 నెంబర్ పరిధిలోని గ్రామాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు పెద్ద ఎత్తున భూములున్నాయన్నారు. 111 జీవో పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు బీఆర్ఎస్ నేతలకు ఉన్నాయని ఆయన ఆరోపించారు.
ఇంకా కూడా ఈ గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు భూములు కొనుగోలు చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. 111 జీవో పరిధిలో ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూములున్నాయో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ భూముల వివరాలు బయట పెట్టకపోతే రానున్న రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో ఈ భూముల వివరాలను బయట పెడతామని భట్టి విక్రమార్క ప్రకటించారు.
111 జీవో ఎత్తివేత వల్ల రైతులు లేదా జంట నగరాలకు సమీపంలోని పర్యావరణకు ఉపయోగపడాలన్నారు. కానీ ఈ జీవో ఎత్తివేత కారణంగా బీఆర్ఎస్ నేతలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. జీవో 111 ఎత్తివేతతో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లు కూడా మిగిలిపోయే పరిస్థితి కూడ లేదని ఆయన ఆరోపించారు.ఈ నెల 19వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం హైద్రాబాద్ లో జరిగింది. ఈ సమావేశంలో 111 జీవోను ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.