పోడు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. భూమి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు.
హైదరాబాద్: పోడు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.గురువారంనాడు హైద్రాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోడు సమస్య పరిష్కరించకపోవడంతో గిరిజనులు, అటవీశాఖాధికారులు ఇబ్బంది పడుతున్నారన్నారు.భూమిపై హక్కును కోల్పోయామనే బాధతో గిరిజనులు భయపడుతున్నారని భట్టి విక్రమార్క చెప్పారు.గత ప్రభుత్వంలో ల్యాండ్ అసైన్డ్ కమిటీలు ఉండేవని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ సీఎం అయ్యాక ఒక్క కమిటీని కూడ ఏర్పాటు చేయలేదన్నారు. ఉన్న కమిటీల సమావేశాలు నిర్వహించలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు.ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని సీఎం కేసీఆర్ ను తాను కోరినట్టుగా ఆయన గుర్తు చేశారు. అర్హులైన వారికి భూములు కూడా ఇవ్వడం లేదన్నారు. భూ ససమస్యలను పరిష్కరించాలని తాము చేసిన వినతిని ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.
మూడు రోజుల క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు మృతి చెందారు. గతంలో కూడా పలు చోట్ల అటవీశాఖాధికారులు, ఆదీవాసీల మధ్య ఘర్షణలు జరిగాయి. అయితే మూడు రోజుల క్రితం మాత్రం గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ అధికారి మృతి చెందాడు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించని కారణంగానే ఫారెస్ట్ అధికారి మృతి చెందాడని విపక్షాలు విమర్శిస్తున్నాయి.