తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని తెలిసి కూడ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా కూడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
సోమవారంనాడు హైద్రాబాద్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాజకీయ అవసరాలకు చెక్ డ్యాంలు కట్టడం వల్లే ఈ సమస్య నెలకొందని ఆయన ఆరోపించారు. భారీ వర్షాల సమయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
గత ఏడాది గోదావరి నదికి భారీ వరద పోటెత్తింది. ఈ సమయంలో భద్రాచలానికి వచ్చిన సీఎం కేసీఆర్ వెయ్యి కోట్లు మంజూరు చేసినట్టుగా ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నిధులను ఇంకా విడుదల చేయలేదని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. అంతకుముందు భద్రాచలానికి వచ్చిన సమయంలో రూ. 100 కోట్లు మంజూరు చేస్తున్నట్టుగా ప్రకటించి చిల్లిగవ్వ కూడ విడుదల చేయలేదని కేసీఆర్ తీరుపై ఆయన మండిపడ్డారు.
also read:హైద్రాబాద్‌లో ప్రారంభమైన భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జాం
భారీ వర్షాల వల్ల జరిగిన నష్టానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.వరద బాధిత ప్రాంతాలకు అధికారులను పంపి నష్టం అంచనా వేయాలని ఆయన అధికారులను కోరారు. నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.