నీళ్లు, నిధులు, నియామకాలు , ఆత్మగౌరవం లేవు : తెలంగాణ బడ్జెట్‌పై భట్టి విక్రమార్క అసహనం

By Siva KodatiFirst Published Feb 6, 2023, 3:56 PM IST
Highlights

తెలంగాణ బడ్జెట్‌పై స్పందించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. నీళ్లు, నిధులు, నియామకాలు , ఆత్మగౌరవం బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు. బడ్జెట్‌లో అంకెల గారడీ .. మంత్రి హరీశ్ రావు మాటల గారడి తప్పించి ఏం లేవన్నారు.

లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ.. చివరికి చేసేదేమి లేదంటూ చురకలంటించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. సోమవారం ఆర్ధిక మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికే ఇలా వ్యహరిస్తున్నారని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కూడా ప్రజలను మభ్యపెడుతున్నారని విక్రమార్క ఆరోపించారు. 24 గంటల విద్యుత్ అనేది ఒట్టి మాటలేనని.. గ్రామాల్లో రైతులు కరెంట్ కోసం అల్లాడిపోతున్నారని భట్టి ఆరోపించారు. పట్టుమని ఐదు గంటలు కూడా కరెంట్ ఉండటం లేదని ఆయన దుయ్యబట్టారు. 

Also REad: ఇళ్లు లేని పేదలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. సొంత స్థలం ఉంటే రూ. 3 లక్షల సాయం.. వివరాలు ఇవే..

డబుల్ బెడ్‌రూం ఇళ్లకు బడ్జెట్‌లో కేటాయింపులు జరగలేదన్నారు. బడ్జెట్‌లో రుణమాఫీ ఊసేలేదని.. బలహీన వర్గాలకు చాలా తక్కువ కేటాయింపులు చేశారని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. అధికారులు రాసిచ్చిన దానిని మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో చదివి వినిపించారని ఆయన దుయ్యబట్టారు. గిరిజన బంధు ఆశించినా నిరాశే ఎదురైందని భట్టి ఫైరయ్యారు. బీసీ యాక్షన్ ప్లాన్‌పై ఏం చెప్పలేదని.. నీళ్లు, నిధులు, నియామకాలు , ఆత్మగౌరవం బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిగా పక్కనపడేశారని ఆయన ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో అంకెల గారడీ .. మంత్రి హరీశ్ రావు మాటల గారడి తప్పించి ఏం లేవన్నారు.

click me!