బాలికపై అత్యాచారం, హత్య.. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళన.. జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

By Sumanth KanukulaFirst Published Dec 3, 2022, 5:01 PM IST
Highlights

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలనగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆతర్వాత చంపేయడం తీవ్ర కలకలం రేపుతోంది. నిందితులను కఠినంగా  శిక్షించాలని బాలిక బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలనగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో 10వ తరగతి చదువుతున్న బాలికపై సామూహిక అత్యాచారం చేసి, ఆతర్వాత చంపేయడం తీవ్ర కలకలం రేపుతోంది. నిందితుల్లో బాలికకు వరుసకు బాబాయి అయ్యే వ్యక్తి కూడా ఉన్నట్టుగా గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పదో తరగతి చదువుతున్న  బాధిత బాలిక శుక్రవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉంది. అయితే బాలిక శనివారం ఉదయం ఉరివేసుకుని కనిపించింది. ముగ్గురు వ్యక్తులు బాలిక ఇంట్లోకి చొరబడి లైగింక వేధింపులకు పాల్పడి హత్య చేశారని ఆమె బంధువులు ఆరోపించారు. బాలికను హత్య చేసి ఫ్యాన్‌కు ఉరేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు నిందితులు యత్నించినట్టుగా చెబుతున్నారు. 

ఈ క్రమంలోనే నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నేరానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న యువకుల్లో ఒకరి ఇంటిపై దాడి చేసి కారు, బైక్‌కు నిప్పు పెట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జడ్చర్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

అయితే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న బాలిక బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. నిందితులను పోలీసులు కాపాడుతున్నారని ఆరోపించారు. పోలీసుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రులు లేకుండానే పోస్టుమార్టమ్‌కు తీసుకొచ్చారని అన్నారు. ఉన్నోళ్లకు ఒక న్యాయం.. పేదోళ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. 

ఇక, ఇదిలా ఉంటే.. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. 

click me!