
ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. కాంగ్రెస్ బీసీ సభలో నేతల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ బీసీ సభకు వీహెచ్ హాజరయ్యారు. అయితే సభకు హాజరయ్యేందుకు వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డిని సాజిద్ ఖాన్ వర్గం అడ్డుకుంది. దీంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేవరకు పరిస్థితి వెళ్లింది. అయితే ఈ పరిణామాలపై సీనియర్ నేత వీహెచ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బౌన్సర్లతో వచ్చి హల్‌చల్ చేస్తానంటే కుదరదని వీహెచ్ పేర్కొన్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి తీరుపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాలకు కూడా వీహెచ్ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇరువర్గాలు ఎంతకు వినకపోవడంతో బయటకు వచ్చేశారు. ఇక, జిల్లా పార్టీ అధ్యక్షుడైన సాజిద్ ఖాన్.. కంది శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా చెప్పారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్టుగా తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీలోకి కొత్తగా వచ్చారని.. ఒరిజినల్ కాంగ్రెస్ ఆచారాలు తెలుసుకోవాలని.. సీనియర్ నేతలపై ఆధిపత్యం చెలాయించాలంటే కుదరదని అన్నారు. ఈరోజు కంది శ్రీనివాస్ రెడ్డి చేసింది తప్పని.. మిగిలిన విషయాలను కాంగ్రెస్ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. ఎన్నికల్లో టికెట్ ఎవరికనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
ఇక, కంది శ్రీనివాస్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు. డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, ఇతర సీనియర్ నాయకులు ఈ పరిణామాలను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో వర్గపోరు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది.