సినీ నటి జయసుధ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయతీర్ధం పుచ్చుకోనున్నారు.
హైదరాబాద్: సినీ నటి జయసుధ బుధవారంనాడు బీజేపీలో చేరనున్నారు. బీజేపీలో చేరేందుకు జయసుధ నిన్ననే న్యూఢిల్లీకి బయలుదేరారు. ఇవాళ సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో జయసుధ బీజేపీలో చేరనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ లు ఇప్పటికే ఢిల్లీలోనే ఉన్నారు. బీజేపీకి చెందిన కొందరు కీలక నేతలు ఇటీవలనే జయసుధతో సంప్రదింపులు జరిపారు. దీంతో బీజేపీలో చేరడానికి జయసుధ సానుకూలంగా స్పందించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి జయసుధ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009 -2014 వరకు ఆమె సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో జయసుధ 2009లో విజయం సాధించడానికి క్రిస్టియన్ల ఓట్లు కీలకంగా మారాయని అప్పట్లో రాజకీయ పరిశీలకులు భావించారు.
అయితే అదే ఫార్మూలా ఈ దఫా కూడ తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని కమలదళం భావిస్తుంది. ఈ కారణంగానే కమలదళం జయసుధను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా చెబుతున్నారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే జయసుధను ఏ స్థానం నుండి పోటీ చేయించాలనే దానిపై పార్టీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. పార్టీలో చేరిన తర్వాత అమిత్ షాతో ఆమె భేటీ కానున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆమె రాజకీయాల్లో అంత క్రియాశీలకంగా లేరు. 2016లో జయసుధ టీడీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో అంత క్రియాశీలకంగా వ్యవహరించలేదు. 2019 మార్చి 7వ తేదీన టీడీపీకి గుడ్ బై చెప్పిన జయసుధ వైఎస్ఆర్‌సీపీలో చేరారు. వైఎస్ఆర్‌సీపీలో కూడ ఆమె అంతగా యాక్టివ్ గా లేరు.ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి.
దీంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం కమలదళం కసరత్తు చేస్తుంది. గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేసిన అభ్యర్థుల కోసం కమల దళం పావులు కదుపుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికలపై తెరవెనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఇటీవల చేరికల వెనుక కూడ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు బీజేపీలో చేరనున్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై మొదటి వారంలో హైద్రాబాద్ లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలకు జేపీ నడ్డా దిశా నిర్ధేశం చేసిన విషయం తెలిసిందే.తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కూడ బీజేపీ నాయకత్వం కేంద్రీకరించింది. ఈ క్రమంలోనే ఈ రెండు రాష్ట్రాల అధ్యక్షులను ఆ పార్టీ నాయకత్వం మార్చింది.