బొడ్డుపల్లి శీను హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్

First Published Feb 2, 2018, 12:21 PM IST
Highlights
  • నల్లగొండ టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు మిస్సింగ్
  • సిమ్ కార్డు, వెపన్ హ్యాండోవర్ చేసి మాయం
  • బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్యకేసు విచారణాధికారి ఈయనే
  • రాజకీయ వత్తిళ్లే కారణమా అన్న అనుమానాలు

నల్లగొండ పట్టణ మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త శ్రీనివాస్ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ హత్య కేసు డీల్ చేస్తున్న నల్లగొండ టూ టౌన్ సిఐ వెంకటేశ్వర్లు ఉదయం నుంచి మాయమైపోయారు. సిఐ తన వద్ద ఉన్న డిపార్ట్ మెంటల్ సిమ్ కార్డును మాడ్గులపల్లి పోలీసు స్టేషన్ లో అప్పగించి వెళ్లిపోయాడు. అలాగే తన వద్ద ఉన్న వెపన్ ను కానిస్టేబుల్  ద్వారా సరెండర్ చేశారు. అంతేకాకుండా తన పర్సనల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేశాడు.

సిఐ వెంకటేశ్వర్లు మాయమైపోయవడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో కలవరం చోటు చేసుకుంది. ఇప్పటికే బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసును సిబిఐ కి కానీ.. ప్రత్యేక దర్యాప్తు సంస్థకు కానీ ఇవ్వాలంటూ ఆయన సతీమణి హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కుట్రతోనే ఈ హత్య జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. కానీ నల్లగొండ ఎస్పీ మాత్రం ఈ హత్య చిల్లర పంచాయితి కారణంగా జరిగింది తప్ప రాజకీయ కుట్ర కోణం లేదని వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో ఈ కేసు తాలూకు ప్రమాణ పత్రం దాఖలు చేయాలని హైకోర్టు నల్లగొండ ఎస్పీని ఆదేశించిన పరిస్థితి ఉంది. మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా విచారణాధికారిగా ఉన్న సిఐ వెంకటేశ్వర్లు మాయమైపోవడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ హత్యపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

కేసును తారుమారు చేయడం కోసం ఉన్నతాధికారుల వత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? లేక.. రాజకీయ పరమైనవ వత్తిళ్లు సిఐ మీద ఉన్నాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. తీవ్రమైన వత్తిళ్ల కారణంగానే సిఐ తట్టుకోలేక మాయమైపోయినట్లు తెలుస్తోంది. ఆయన సొంత ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేయడంతో ఆయన ఎక్కడున్నారు? ఎటు వెళ్లారు అన్నది తేలడంలేదు.

ఈనెల 24వ తేదీన బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య జరిగిన నాటినుంచి ఈ హత్య కేసు విషయమై ఇటు అధికార టిఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ మాటల యుద్ధం చేస్తోంది. హత్యకు అధికార పార్టీ నేతలే కారణమని కాంగ్రెస్ విమర్శించగా సొంత పార్టీవారే శ్రీనివాస్ ను హత్య చేశారని టిఆర్ఎస్ చెబుతూ వస్తోంది. తుదకు కేసు కోర్టుకు చేరి.. కోర్టు జోక్యం చేసుకున్న తరుణంలో ఉన్నఫలంగా సిఐ మాయమైపోవడం పెద్ద దుమారమే రేపుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

click me!