కేసిఆర్ కు చుక్కా రామయ్య ఘాటు చురకలు

First Published Dec 4, 2017, 3:50 PM IST
Highlights
  • కోదండరాం ను అవమానించడం బాధాకరం
  • అరే ఒరే అంటే కోదండరాం గౌరవం తగ్గదు
  • జనాల బాధలను ఇప్పటికైనా పట్టించుకోండి
  • కోదండరాం పై పగ పట్టాల్సిన అవసరం లేదు

తెలంగాణ సిఎం కేసిఆర్ పై విద్యావేత్త చుక్కా రామయ్య ఘుటుగా చురకలు అంటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగ పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కొలువులకై కొట్లాట సభలో ఆయన కీలక ఉపన్యాసం చేశారు. సభలో చుక్కా రామయ్య ఏమన్నారో చదవండి.

ప్రజల కోసమే కోదండరాం పనిచేస్తున్నాడు. అలాంటి కోదండరాం ను అవమానించాలని చూస్తే జనాలు నొచ్చుకుంటారు.  జెఎసి ఛైర్మన్ ను రారా పోరా అని పిలిస్తే నా మనసు బాధపడతది. నన్ను అవమానించినా పరవాలేదు. ఎవరైతే తెలంగాణ కోసం పోరాడిన్రో వారిని అవమానించడం బాధాకరం. జెఎసి ఛైర్మన్ గా కోదండరాం ఏ లక్ష్యాల కోసం పోరాడిండో.. ఆ పోరాటం ఇంకా ముగిసిపోలేదు. అందుకే ఆయన గత మూడున్నర సంవత్సరాల నుంచి కాలుకు బలపం కట్టుకుని తిరుగుతున్నాడు. అందుకు నేను ఆయనకు అభినందనలు చెబుతున్నాను.

నిరుద్యోగ సమస్య చాలా ఝటిలమైంది కాబట్టి ప్రభుత్వానికి లాంగ్ టైమ్ ఇచ్చాడు. ప్రభుత్వం సమస్యలను పట్టించుకోవడంలేదని తెలిసిందో విద్యార్థులు, యువతలో నిరాశ నెలకొన్నదని తెలిసిందో అప్పుడే ఉద్యమం మొదలు పెట్టాడు. ప్రజా సమస్యలు లేవనెత్తితే ఆ మనుషులను ఏవిధంగా టార్చర్ చేస్తున్నారో చూస్తున్నాను. పత్రికల్లో చదువుతున్నాను.

తెలంగాణ భవిష్యత్తు ప్రకాశవంతంగా కనబడతలేదు నాకు. అన్నిటికంటే మొదలే ఉద్యోగాల సమస్యను పట్టించుకోవాల్సి ఉండే. తెలంగాణ వచ్చినప్పటినుంచి డిఎస్సీ లేదు. అందుకే యువతలో నిరాశ నెలకొంది. తెలంగాణ సమస్య నిరుద్యోగుల సమస్యే. జీవనభృతి సమస్యే.

గత 50 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో ఆకలిపోరాటాలే నడిచాయి. ఆకలి కోసమే సాయుధ పోరాటం జరిగింది. ఆకలి కోసమే 69 పోరాటం జరిగింది. అదే ఆకలి కోసం 96 నుంచి పోరాటం సాగుతున్నది. కానీ ప్రభుత్వం ఏ సమస్యల కోసం ఎన్నికైందో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టే ఉద్యమం వచ్చింది.

మీకు కోదండరాం పై పగ ఉండాల్సిన అవసరం లేదు. కోదండరాం మీద ఈగ వాలినా తెలంగాణ యువతను అవమానపరిచినట్లేనని మేము భావిస్తాం. కోదండరాం ఏ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోరాటం చేయడంలేదు. ఎంపి కావాలని, ఎమ్మెల్యే కావాలని ఆయన అడుగుతలేడు. యువతకు ఉద్యోగాలు కావాలని అడుగుతున్నాడు.

ఏ నోటిఫికేషన్ వేసినా కోర్టుకు పోతున్నారని అంటున్నారు. కానీ కోర్టుకు ఎందుకు పోతున్నారో ఆలోచించడంలేదు. ప్రభుత్వ శాఖలు నోటిఫికేషన్ ను అన్ని శాఖలకు పంపి తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. కానీ అలా చేయడంలేదు. ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఉంది. అంతే తప్ప ఉద్యోగాలు లేకపోవడం కాదు.

చదువుకున్నవారి సమస్యే కాదు చదువుకొని గ్రామాల్లో ఉన్నవారి సమస్య కూడా ఇది. ప్రభుత్వ పాఠశాలలకు గ్రాంట్స్ లేవు. ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్లు తాము చదువుతున్న పాఠశాలలకు డబ్బులు పంపుతున్నారు. గ్రామాల్లో చదువుకున్నవారికే ఉద్యోగాలు లేకపోతే మీరు బడికిపోయి ఏం చేస్తారని తల్లిదండ్రులు అడిగే పరిస్థితి వచ్చింది. చదువుకున్నవారికే ఉద్యోగాలు దొరుకుతలేవు. పుట్టబోయే పిల్లవాడిని ఎందుకు బడికి పంపాలని అడిగే ప్రమాదం ఉంది. తెలంగాణ లిటరసీ రేటు తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.

జిఓల ఆటంకం ఉందని సమస్యలను దాటవేస్తూ పోతే ప్రజల్లో అసంతృప్తి రగిలిపోతది. ఈ సమయంలో నేను ఒకటే కోరుతున్నాను. ఈ సమస్య జెఎసి సమస్య కాదు. అన్ని పార్టీల సమస్య ఇది. తెలంగాణ గ్రామాల్లో దీని ప్రభావం చూపించబోతున్నది. అన్న పార్టీల వారు ప్రయార్టీగా ఈ సమస్యపై ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాను. లాయర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ జిఓలో అయినా లోపాలు ఉన్నట్లైతే మీరు స్పష్టంగా

నేను స్పష్టంగా కేసిఆర్ కు ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ప్రజల్లో ఉన్న అసంతృప్తిని మీకు చెప్పినా అర్థం చేసుకోవడంలేదు కాబట్టే ఈ సమావేశం పెట్టారని చెబుతున్నాను. నేను నిన్న వరంగల్ నుంచి వస్తుంటే నా కారునే మూడు దిక్కుల ఆపేశారు. మనుషులు రాకుండా ఆపితే అన్యాయం ఆగదు. సమస్య పరిష్కారం కాదు.

కేసిఆర్ పర్మిషన్ ఇయ్యనంత మాత్రాన సమస్య లేదని కాదు. సమస్యను చూస్తే మీరు భయపడుతున్నారని అర్థం. ఎంతో అసంతృప్తి ఉన్నది ఇక్కడ. అధికారంలో ఉన్నవారికి ఎప్పుడైనా కీర్తించే మనుషులు చుట్టూ ఉంటారు. ఇప్పటికైనా వాస్తవం తెలుసుకో. మీరు ప్రజా కంఠకులుగా కావొద్దని పోలీసులకు కోరుతున్నాను. ప్రజల కోసం పోరాడుతున్నారో వారిని ఇబ్బందులపాలు చేసి మీరు అప్రతిష్టపాలు కావొద్దని పోలీసులకు మనవి చేస్తున్నాను.

కోదండరాం ను అనవసరంగా ఇబ్బందులపాలు చేయరాదని పోలీసులకు మనవి చేస్తున్నాను. తెలంగాణ యువకులకే కాదు కోదండరాం తెలంగాణ పీడిత ప్రజానీకానికి అతనొక ఐకాన్ అయ్యాడని చెబుతున్నాను. మనుషులను పేపర్లలో తిట్టినంత మాత్రాన వారి గౌరవం తగ్గదు. మనుషులను తిట్టి అపఖ్యాతి చేస్తే ప్రజలకు దూరం చేస్తాను అనుకోవచ్చు కానీ ఇంకా ప్రజలకు దగ్గరవుతున్నాడని చెప్పగలను.

ఉద్యోగం రాకపోవడానికి ఆంధ్రా పాలకులు కారణం అని చెప్పారు. మరి ఇప్పుడు మాత్రం ఉద్యోగాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాను. జెఎసి మీకు శత్రువులు కాదు. కోదండరాం మీకు శత్రువు కాదు. జెఎసి ఛైర్మన్ గా అతనికి సమస్యలు తెలుసు. ఈ సమావేశం మీకు వ్యతిరేకం కాదు. రాజకీయాల్లో శత్రుత్వం ఉండదు. డిఫర్ అయినంతమాత్రాన అనగదొక్కాల్సిన అవసరం లేదు. ప్రజల వాంఛలు ఎవరైతే గుర్తించరో వారు అప్రతిష్టపాలవుతారు. ప్రజల్లో అసంతృప్తి ఉన్నది. గత పాలకులు చెసిన తప్పులు ఈ విషయంలో మీరు చేయవద్దు. ఉద్యమాన్ని ప్రశాతంగా నడిపించండి. ప్రభుత్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి చూడాలని ప్రార్థిస్తున్నాను.

click me!