అప్ఘాన్ తో అగిపోరు... తాలిబాన్ల లక్ష్యం భారతేనట: విజయశాంతి ఆందోళన

Arun Kumar P   | Asianet News
Published : Aug 18, 2021, 03:36 PM IST
అప్ఘాన్ తో అగిపోరు...  తాలిబాన్ల లక్ష్యం భారతేనట: విజయశాంతి ఆందోళన

సారాంశం

అరాచకం సృష్టిస్తూ అప్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు చైనా, పాక్ ప్రోద్భలంతో భారత్ ను లక్ష్యంగా చేసుకోనుందన్న సోషల్ మీడియా ప్రచారం ఆందోళనకు గురిచేస్తోందని బిజెపి నాయకురాలు విజయశాంతి అన్నారు. 

హైదరాబాద్: ప్రస్తుతం అప్ఘానిస్తాన్ లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ బిజెపి నాయకురాలు విజయశాంతి సోషల్ మీడియా వేదికన స్పందించారు. తాలిబాన్ల చేతిలోకి అప్ఘాన్ మహిళలు లైంగిక బానిసలుగా మారిపోయే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తాలిబాన్లు ఒక్క అప్ఘాన్ ఆక్రమణతో ఆగిపోరని... పాక్, చైనా ప్రొద్భలంతో భారత్ ను లక్ష్యంగా చేసుకునే ప్రమాదం వుందంటున్న సోషల్ మీడియా ప్రచారం ఆందోళనకు గురిచేస్తోందన్నారు విజయశాంతి. 

విజయశాంతి ఫేస్ బుక్ పోస్ట్ యధావిధిగా: 

ఆప్ఘనిస్థాన్ పరిస్థితుల్ని చూస్తే గుండె చెరువైపోతోంది. 1996 నుంచి 2001 వరకూ అక్కడ చోటుచేసుకున్న పరిణామాల జ్ఞాపకాలు నేటికీ పీడకలలా వెంటాడుతూ స్మృతిపథం నుంచి చెరిగిపోకముందే మళ్ళీ నరరూప రాక్షసులైన తాలిబన్ల ఆటవికపాలన మొదలైంది. మహిళల్ని లైంగిక బానిసలుగా చేసి, పిల్లల్ని కనే యంత్రంలా మార్చేసి, విద్య-ఉద్యోగాలకు దూరం చేసిన దుర్మార్గపు రోజులు మళ్ళీ వచ్చేశాయి. నిబంధనలు పాటించని వారిని రాళ్లతో కొట్టి చంపడం, చిన్న తప్పులకే బహిరంగంగా కాళ్ళు, చేతులు నరకడం, మతగ్రంథంలోని నిబంధనలు అనుసరించకపోతే తల నరికేయడం, చెట్టుకు వేలాడదీసి ఉరివేయడం, బతికుండగానే తగులబెట్టడం లాంటి దారుణమైన మధ్యయుగపు మూర్ఖపు శిక్షలు వారికి నిత్యకృత్యం. 

బురఖా ధరించని ఒక నడివయసు మహిళను తలపై కాల్చి చంపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతటి నీచ నికృష్టమైన తాలిబన్ సర్కారును పాకిస్తాన్ గుర్తించి ఆ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ప్రశంసించడంలో ఆశ్చర్యమేమీ లేదు గానీ... గొప్ప కమ్యూనిస్ట్ దేశాలుగా చరిత్రకెక్కిన చైనా, రష్యాలు కూడా వంతపాడటం దౌర్భాగ్యం. ఈ పరిణామాలపై మన దేశంలోని కమ్యూనిస్ట్ నేతలు, కాంగ్రెస్ నేతలు ఇంతవరకూ స్పందించనే లేదు. 

ఇదిలా ఉంటే తాలిబన్లతో చర్చలకు అవకాశముండాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కేంద్రానికి సలహా ఇచ్చి తన సంస్కారాన్ని చాటుకున్నారు. తాలిబన్ల కంటే పలు రెట్లు అధికంగా ప్రభుత్వ సైన్యం ఉన్నప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ భద్రతా దళాలు తోకముడిచాయి. ఇది పూర్తిగా దేశభక్తి, జాతీయవాద చైతన్యం లేని ఆ దేశ ప్రజల ఘోర వైఫల్యం తప్ప మరొకటి కాదు.

తాలిబన్లు కేవలం ఆప్ఘనిస్థాన్‌తో ఆగిపోరని, చైనా-పాక్ తోడ్పాటుతో దీర్ఘ కాలంలో వారి లక్ష్యం భారత్ అని కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కనిపిస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో భారతీయుల ఐక్యతే శ్రీరామరక్ష.
 

PREV
click me!

Recommended Stories

ఏప్రిల్ 25న కవిత కొత్త పార్టీ ఇక యుద్ధం మొదలు | Kavitha New Political Party | Asianet News Telugu
ఒక్క క్లిక్.. జీవితం మటాష్! | Hyderabad CP VC Sajjanar Warning | IPL betting | Asianet News Telugu