సీఎం జగన్‌తో పరిచయం లేదు.. వారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు చీకోటీ ప్రవీణ్ ఫిర్యాదు

By Sumanth KanukulaFirst Published Aug 3, 2022, 3:01 PM IST
Highlights

క్యాసినో వ్యవహారంలో  హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటీ ప్రవీణ్‌ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుపై ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్ కోరారు.

క్యాసినో వ్యవహారంలో  హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న చీకోటీ ప్రవీణ్‌ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుపై ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చీకోటి ప్రవీణ్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ అకౌంట్లలో తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆరోపించాడు. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి పోస్టుల వల్ల మానసికంగా ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. 

ఏపీ సీఎంతో తనకు సంబంధాలున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని.. అసలు ఆయనతో తనకు పరిచయమే లేదని చీకోటి ప్రవీణ్ చెప్పారు. దీని వెనుక ఏపీ ప్రతిపక్ష నాయకులు ఉన్నట్లుగా అనుమానంగా ఉందని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లలో కించపరిచే విధంగా పోస్టులు పెట్టే వ్యక్తులను పట్టుకోవాలని ఫిర్యాదులో చీకోటి ప్రవీణ్ పేర్కొన్నారు. ఇదే విషయంపై ఏపీ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టుగా చెప్పారు. ఇక, ఈ కేసులో చీకోటి ప్రవీణ్ నేడు మూడో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.

ఇక, రెండో రోజు (ఆగస్టు 2) ఈడీ విచారణకు హాజరయ్యే ముందు చీకోటీ ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ సోషల్ మీడియా ఖాతాలు ఎవరు సృష్టించారో తనకు తెలియదన్నారు. ఈ విషయమై విచారణ జరిపించాలని ఆయన పోలీసులను కోరారు.

మరో వైపు ఈడీ విచారణకు సంబంధించి వాస్తవాలు రాయాలని కూడా ఆయన మీడియాను కోరారు. అతిగా ఊహించుకొని మీడియాలో కథనాలు ప్రసారం చేయడం వల్ల మీకు వచ్చే లాభం కూడా లేదని ఆయన మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు.  పలు మీడియా సంస్థలు పలు రకాలైన కథనాలు ప్రసారం చేస్తున్నాయన్నారు. అసలు వాస్తవాలు ఏమిటో మీరే తేల్చుకోవాలన్నారు. ఏది వాస్తవమో కూడా తేల్చుకోలేకపోతున్నారు.. వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని ఆయన మీడియాను కోరారు.వాస్తవాలు ప్రసారం చేస్తేనే ప్రజలు నమ్ముతారన్నారు. అతిగా ఊహించుకొని తనను డీఫేమ్ చేయడం ద్వారా ఏముస్తుందని కూడా ఆయన మీడియాను ప్రశ్నించారు. కేసినో కు సంబంధించి తాను త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తానని కూడా ఆయన వివరించారు.

click me!