
పండుగలు, పబ్బాలు, ఆదివారాలు.. ఇలా ముక్కలేనిదే పూట తినని వారు ఎందరో.. నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా కోడికూర తింటుంటారు. కానీ ప్రస్తుతం ఎండలు మండిపోతుండటంతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో సామాన్యులు ముక్క ముట్టుకోవాలంటే భయపడిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చికెన్ ధరలు విపరీతంగా పెరిగాయి. కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.330కు చేరింది.
గత నెలలో రూ.220గా ఉన్న చికెన్ ధర ఇప్పుడు ఏకంగా వంద రూపాయలు పెరిగింది. విజయవాడలో ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ.320 చేరుకుంది. అటు హైదరాబాద్‌లోనూ రూ. 3000 నుంచి రూ. 330 వరకు ధర పలుకుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి.. ఇబ్బందులు పడుతున్న జనానికి చికెన్ ధరల పెరుగుదల గుదిబండలా మారింది. అయితే చికెన్ ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు.
ఎండాకాలంలో శరీరానికి వేడి చేస్తుందనే ఉద్దేశంతో ఆరోగ్యాన్ని దృష్టి వుంచుకుని చాలా మంది చికెన్ తినరు. అలాగే ఎండల ధాటికి కోళ్లు భారీగా చనిపోతున్నాయి. అందుకే సమ్మర్‌లో కోళ్ల ఉత్పత్తి, డిమాండ్ అనూహ్యంగా పెరుగుతూ వుంటుంది. ప్రస్తుతం డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో, దాణా ధరలు పెరగడం, ఇతర ఖర్చుల కారణంగా చికెన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జూన్ రెండవ వారంలోకి ప్రవేశించినా తెలుగు రాష్ట్రాల్లో వర్షం జాడ లేకపోవడం, ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ వుండటంతో వర్షాకాలం ఊపందుకునే వరకు చికెన్ ధరలు భారీగానే వుంటాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.