
పెద్ద నోట్ల రద్దు ప్రభావం అటు తిరిగి ఇటు తిరిగి ప్రభుత్వాల ఖజానాలపై భారీగానే పడుతోంది. హటాత్తుగా కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు ఫలితంగా వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలకు కూడా ఇబ్బంది అయ్యేట్లుందని సమాచారం. ఒకే విధమైన పరిస్ధితి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనబడతోంది. అయితే, ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాల్లో సగం ఇచ్చి మిగిలిన జీతాన్ని మెల్లిగా చెల్లిస్తే ఎలాగుంటుందన్న అంశాన్ని తెలంగాణా ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం ప్రభుత్వ ఖజానాలపైన చాలా తీవ్రంగా పడింది. ఏపిలో ప్రతీ నెలా ఉద్యోగుల జీతాలకే సుమారుగా రూ. 4 వేల కోట్లు అవసరం. ఇతరత్రా ఖర్చులు ఉండనే ఉంటాయి. అదేవిధంగా పలు మార్గాల్లో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సుమారు రూ. 8 వేల కోట్లు. ఆదాయ, వ్యయాల మధ్య సుమారు ప్రతీ నెలా రూ. 2 వేల కోట్ల వ్యత్యాసం ఉంటుందని సమాచారం. ఇక, అభివృద్ది కార్యక్రమాలకు పెడుతున్న ఖర్చు, అప్పులు, వడ్డీల చెల్లింపు ఉండనే ఉన్నాయి. దాంతో ప్రభుత్వానికి అన్నీ చెల్లింపుల తర్వాత ఎంత మిగులుతుందనేది ప్రశ్నార్ధకమైంది.
కేంద్రం తీసుకున్న హటాత్ నిర్ణయం వల్ల ఇపుడు ఆదాయాలన్నీ పడిపోయాయి. ఆదాయాలు పడిపోవటమన్నది వచ్చే నాలుగు నెలల్లో ప్రభుత్వ ఖజానాపై సుమారుగా రూ.6 వేల కోట్లుంటుందని ఉన్నతాధికారులు చంద్రబాబునాయడుకు వివరించినట్లు తెలిసింది. మరో 15 రోజుల పాటు పరిస్థితిని గమనించిన తర్వాత వచ్చే నెల జీతాల చెల్లింపుపై నిర్ణయం తీసుకోవచ్చని అధికారులు అనుకుంటున్నట్లు సమాచారం.
ఇక, తెలంగాణా విషయానికి వస్తే ప్రతీ నెలా ఖజానాకు సుమారు రూ. 9 వేల కోట్ల ఆదాయం వస్తోంది. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల ఆదాయంలో సగానికి పైగా కోత తప్పదని ఉన్నతాధికారులు సిఎం కెసిఆర్ కు వివరించినట్లు తెలిసింది. ప్రతీ నెలా ఉద్యోగుల జీత, బత్యాలకే సుమారు రూ. 2500 కోట్లు, అప్పుల చెల్లింపులు, వాటిపై వడ్డీలకు మరో రూ. 1100 కోట్లు తప్పవని చెప్పినట్లు సమాచారం. అంటే ఆదాయం సగానికి పడిపోయినా ఉద్యోగుల జీతాలు, వాయిదాల చెల్లింపులు, వడ్డీలకే సుమారు రూ. 3600 కోట్లు పోతుంది. ఇక మిగిలిన ఖర్చుల మాటేమిటనే సమస్య ఉన్నతాధికారులను పీడిస్తోంది.
కాస్త అటు ఇటుగా రెండు రాష్ట్రాల్లోని సమస్యలు ఒకే విధంగా ఉండటంతో నిధుల ప్రభావం తక్షణం సంక్షేమ కార్యక్రమాలపై చూపనుంది. దాని తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాల చెల్లింపులపై పడనుంది. దాంతో రెండు రాష్ట్రాల ఖజానాలపై మరి కొద్ది నెలల పాటు తీవ్ర ప్రభావమే చూపనుండటం ఖాయం.