మలక్‌పేట్ అనురాధ కేసు .. చంద్రమౌళి రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలన విషయాలు

By Siva Kodati  |  First Published May 26, 2023, 9:27 PM IST

మలక్‌పేట్‌లో అనురాధ హత్య కేసుకు సంబంధించి నిందితుడు చంద్రమౌళి రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలను ప్రస్తావించారు. రూ.17 లక్షల నగదు, 2 కిలోలకు పైగా బంగారం తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే ఆమెను హత్య చేసినట్లు తెలిపారు. 
 


హైదరాబాద్ మలక్‌పేట్‌లో అనురాధ అనే మహిళ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బాకీ తీర్చమన్నందుకు ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసి ఆపై మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఈ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును మలక్‌పేట్ పోలీసులు రాచకొండ పోలీసులకు బదిలీ చేశారు. ఈ క్రమంలో రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. 15 ఏళ్లుగా చంద్రమౌళి, అనురాధలు సహజీవనం చేస్తున్నారని.. అయితే వీరిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలు వున్నాయని  పోలీసులు తెలిపారు. అయితే ఈ గొడవల కారణంగా పెళ్లి చేసుకోవాలని అనురాధ ప్లాన్ చేసింది. ఇందుకోసం మ్యాట్రిమెనీలో ప్రకటనలు కూడా ఇచ్చింది. 

ఇదే సమయంలో తాను పెళ్లి చేసుకోబోతున్నానని.. తాను గతంలో ఇచ్చిన రూ.17 లక్షల నగదు, 2 కిలోలకు పైగా బంగారం తిరిగి ఇవ్వాలని చంద్రమౌళిని అనురాధ కోరింది. అయితే ఆమెను హత్య చేస్తే డబ్బు, బంగారం ఇవ్వాల్సిన అవసరం వుండదని నిర్ణయించుకున్న చంద్రమౌళి ఇందుకోసం కుట్రపన్నాడు. ఈ క్రమంలో ఓ రోజున అనురాధతో గొడవ పడే ఆమెపై విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. అనంతరం  ఒక రోజంతా అనురాధ మృతదేహాన్ని బయటే వుంచాడు. ఈలోగా అనురాధ పక్క పోర్షన్‌లో అద్దెకు వుంటున్న వారు పొరుగూరికి వెళ్లడంతో ఆమె మృతదేహాన్ని స్టోన్ కట్టర్‌తో ముక్కలు ముక్కలు చేశాడు. అనంతరం శరీర భాగాలను ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో దాచాడు. 5 రోజుల తర్వాత అనురాధ తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడు. 

Latest Videos

undefined

ALso Read: అనురాధరెడ్డి హత్య కేసు : పదిహేనేళ్లుగా సహజీవనం.. రూ.7లక్షల కోసం కిరాతకంగా హత్య..

మృతదేహాన్ని మాయం చేసేందుకు యూట్యూబ్‌తో పాటు ఆన్‌లైన్‌లో వెతికిన చంద్రమోళి.. దుర్వాసన రాకుండా కర్పూరం పౌడర్, ఇతర కెమికల్స్ వాడాడు. కూతురితో తప్పించి బంధువులెవరూ లేకపోవడంతో ఇదే అదనుగా అనురాధ బతికే వున్నట్లు డ్రామా ఆడాడు. మృతురాలి ఫోన్‌ నుంచి ఆమె కుమార్తెకు మెసేజ్‌లు పెడుతూ.. తాను చార్‌ధామ్ యాత్రకు వెళ్తున్నట్లు తెలిపాడు. తన పథకంలో భాగంగా అనురాధ సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కి తీసుకెళ్లి ధ్వంసం చేయాలనుకున్నాడని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టం చేశారు. 
 

click me!