ఎదురే నాకు లేదు, ఎవరూ అడ్డుకోరు:చంద్రబాబు

By Nagaraju TFirst Published Nov 29, 2018, 4:50 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రంలో తనకు ఎదురులేదని తానేం చేసిన అడ్డుకోలేరని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భవ్య ఆనంద్ ప్రసాద్ కు మద్దతుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తనకు ఎదురులేదని తానేం చేసిన అడ్డుకోలేరని ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ప్రజాకూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భవ్య ఆనంద్ ప్రసాద్ కు మద్దతుగా చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. 

తెలంగాణలో తనకు ఎదురులేదని తెలిసే కేసీఆర్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అబద్ధాలు చెప్పే కేసీఆర్‌కు ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్‌కు కావాల్సిందే రాజకీయమేనని అందుకే తనను విమర్శిస్తూ రాజకీయాలు చేస్తారని చంద్రబాబు ఆరోపించారు. 

తెలుగుద రాష్ట్రాలు కలిసి ఉండాలని, ఇద్దరం కలిసి పనిచేద్దామంటే కేసీఆర్‌ ఒప్పుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్రమోదీకి బి టీమ్ కేసీఆర్ అంటూ ఆరోపించారు. దేశంలో రెండే రెండు ఫ్రంట్‌లు ఉన్నాయని అందులో ఒకటి బీజేపీ ఫ్రంట్‌, మరోటి బీజేపీ వ్యతిరేకి ఫ్రంట్ అని చెప్పారు. కేసీఆర్ ఏ ఫ్రంట్‌లో ఉన్నారో తేల్చుకోవాలన్నారు. 
 
హైదరాబాద్‌ అభివృద్ధికి, ఐటీ అభివృద్ధికి.. చంద్రబాబే కారణమని మంత్రి కేటీఆర్‌ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటిది తనను ఏ మొహం పెట్టుకొని విమర్శిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని కేసీఆర్‌ నెరవేర్చలేదని, డబుల్‌ బెడ్‌ రూమ్‌, దళితులకు మూడెకరాల భూమి ఎవరికిచ్చారని నిలదీశారు. 

మాయమాటలతో కేసీఆర్‌ పబ్బం గడుపుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజాకూటమి ప్రభుత్వంలో మైనార్టీల హక్కులు కాపాడతామని భరోసా ఇచ్చారు. దళితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణమే తన లక్ష్యమని తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు.  

click me!