హేమాహేమీల అడ్డా: ఆ ప్రముఖులు ఇక్కడివారే

By narsimha lodeFirst Published Nov 29, 2018, 4:30 PM IST
Highlights

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు తుంగతుర్తితో పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించారు

తుంగతుర్తి: తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పలువురు కీలక నేతలు తుంగతుర్తితో పాటు ఉమ్మడి ఏపీ రాష్ట్రంలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి విజయం సాధించారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, అపద్ధర్మ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిలు కూడ తుంగతుర్తి నియోజకవర్గానికి చెందినవారే.

ఖమ్మం జిల్లాలోని లింగాలకు చెందిన మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తుంగతుర్తికి అల్లుడిగా వచ్చాడు. తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా, ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు. 1985 నుండి 2004 వరకు తుంగతుర్తి నుండి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విజయం సాధించారు. 1994 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టు దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి విజయం సాధించారు.

అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో తుంగతుర్తి సెగ్మెంట్ ఎస్సీలకు రిజర్వ్ అయింది. దీంతో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ, సీపీఐ, సీపీఎం, టీఆర్ఎస్ మహాకూటమిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు. పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఐజీగా పనిచేసి వీఆర్ఎస్ తీసుకొన్నారు. 2004 ఎన్నికల్లో మిర్యాలగూడ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

2009 ఎన్నికల సమయానికి పోరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి రాంరెడ్డి దామోదర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2004 ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తన మంత్రివర్గంలో చోటు దక్కింది. 2009 ఎన్నికల్లో రాంరెడ్డి దామోదర్ రెడ్డి మరోసారి విజయం సాధించారు. కానీ, ఖమ్మం జిల్లా నుండి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సోదరుడు రాంరెడ్డి వెంకట్ రెడ్డికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన మంత్రివర్గంలో చోటు కల్పించారు.

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని తాటిపాముల గ్రామానికి చెందిన నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ చీఫ్. ఎయిర్ ఫోర్స్ లో పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి 1999 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో కూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసి మరోసారి విజయం సాధించారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ కాకుండా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి మారారు. 2009 ,2014 ఎన్నికల్లో ఉత్తమ్ ఈ స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని నాగారం గ్రామానికి చెందిన గుంటకండ్ల జగదీష్ రెడ్డి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి మహాకూటమి అభ్యర్ధిగా పోటీ చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

2014 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి జగదీష్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై  విజయం సాధించారు. మరోసారి వీరిద్దరూ మరోసారి బరిలోకి దిగుతున్నారు.

తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి 1957లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పలు దఫాలు మిర్యాలగూడ పార్లమెంట్ స్థానం నుండి విజయం సాధించారు. భీంరెడ్డి నర్సింహ్మారెడ్డి సోదరి మల్లు స్వరాజ్యం కూడ సీపీఎం అభ్యర్థిగా తుంగతుర్తి నుండి పోటీ చేసి విజయం సాధించారు.

తుంగతుర్తి నియోజకవర్గంలోని బండరామారం గ్రామానికి చెందిన ఆకారపు సుదర్శన్ 1989,1994 ఎన్నికల్లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో ఆకారపు సుదర్శన్ ఓటమి పాలయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన సంకినేని వెంకటేశ్వరరావు 1999లో ఇదే నియోజకవర్గం నుండి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డిపై విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి సంకినేని వెంకటేశ్వరరావుపై స్వల్ప ఓట్ల తేడాతో విజయం సాధించారు.తుంగతుర్తి నియోజకర్గంలోని రామన్నగూడెం నియోజకవర్గానికి చెందిన అనిరెడ్డి పున్నారెడ్డి ఆలేరు నుండి 1967, 1972 విజయం సాధించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని గానుగబండకు చెందిన నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్ పేట అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా మూడు దఫాలు విజయం సాధించారు.

నల్గొండ ఎంపీ స్థానానికి కూడ నల్లు ఇంద్రసేనారెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు నల్గొండ జిల్లాలో ఉండేవి. తుంగతుర్తి నియోజకవర్గంలోని ఏపూరు గ్రామానికి చెందిన మద్దికాయల ఓంకార్ వరంగల్ జిల్లాలోని నర్సంపేట నుండి సీపీఎం అభ్యర్థిగా, ఎంసీపీఐ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 

సంబంధిత వార్తలు

కారణమిదే: ఆ స్థానంలో ఇంతవరకు టీడీపీ గెలవలేదు
 

click me!