మిలియన్ మార్చ్: ఈ అర్థరాత్రికల్లా హైదరాబాద్ కు ఆర్టీసీ కార్మికులు

By telugu teamFirst Published Nov 8, 2019, 1:38 PM IST
Highlights

ఆర్టీసీ జేఏసీ నేతలు నవంబర్‌ 9న చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరో మిలియన్‌ మార్చ్‌ తరహాలో దీనిని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నాహాలు చేస్తుంది. 

టీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మె 35వ రోజుకు చేరుకుంది. తమ ఆందోళనల్లో భాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు నవంబర్‌ 9న చలో ట్యాంక్‌బండ్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మరో మిలియన్‌ మార్చ్‌ తరహాలో దీనిని నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ సన్నాహాలు చేస్తుంది. 

Also read: ఆర్టీసీ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేసీఆర్ కు చుక్కెదురు!

ఆర్టీసీ జేఏసీ చేపట్టనున్న చలో ట్యాంక్‌బండ్‌కు ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఇప్పటికే తమ మద్దతును ప్రకటించాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలాంటి కార్మికుల అక్రమ అరెస్టులను యూనియన్ నేతలు ఖండించారు.

నేటి రాత్రి కల్లా కార్మికులంతా హైదరాబాద్ చేరుకోవాలి: అశ్వత్థామరెడ్డి

కార్మికుల అక్రమ అరెస్టులపై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి మీడియా ముందుకొచ్చారు. కార్మికుల ఇళ్లలో దాడులు చేసి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారనిప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. మహిళ కార్మికులను కూడా అరెస్ట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్‌ నిర్వహించి తీరుతామని వెల్లడించారు. కార్మికులు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని, పోలీసులు దమనకాండ ఆపాలని ఈ సందర్బంగా అన్నారు. అరెస్ట్‌ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ రోజు రాత్రి కల్లా కార్మికులందరూ హైదరాబాద్‌కు చేరుకోవాలని పిలుపునిచ్చారు.

Also read: rtc strike: ఆర్టీసీపై కేంద్రం వాదన ఇదీ: కేసీఆర్‌కే కాదు జగన్‌కూ తలనొప్పి

సమ్మె, భవిష్యత్‌ కార్యచరణపై చర్చించేందకు ఓయూ జేఏసీతో జరగాల్సిన  సమావేశాన్ని ఆర్టీసీ జేఏసీ రద్దు చేసుకుంది. కార్మికుల అక్రమ అరెస్ట్‌ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతోంది. 

మరోవైపు ముగ్దుం భవన్‌లో అఖిలపక్ష నాయకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ కార్మికుల ముందస్తు అరెస్టులపై నేతలు చర్చించనున్నట్టు తెలియవస్తుంది. ఈ సమావేశంలో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పాల్గొంటున్నారు.

click me!