
తెలంగాణలో ధాన్యం సేకరణకు (paddy procurement in telangana) సంబంధించి టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు పోటాపోటీగా ధర్నాలు కూడా చేపట్టాయి. కేంద్రందే తప్పని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని బీజేపీ మండిపడుతుంది. తాజాగా ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను (Piyush Goyal) తెలంగాణ మంత్రుల బృందం శుక్రవారం కలిసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తెలంగాణలో ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం వివరణ ఇచ్చింది. రాష్ట్రంలో యథావిథిగా ధాన్యం కొనుగోలు చేపడతామని కేంద్రం వెల్లడించింది. గతంలో నిర్ణయించిన మద్దతు ధరకే ధాన్యం సేకరించనున్నట్టుగా తెలిపింది.
ఇక, శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) నేతృత్వంలో పలువరు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సొమేష్ కుమార్.. ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ ఘోయల్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి.. ధాన్యం సేకరణకు సంబంధించి కేంద్రం తీరుపై మండిపడ్డారు. ఎంతో ఆశతో తాము ఢిల్లీ వచ్చామని.. కానీ తమకు నిరాశే ఎదురైందని అన్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో వరి పంటను వేయనివ్వవద్దని కేంద్ర మంత్రి గట్టిగా చెప్పారని అన్నారు.
‘సీఎం కేసీఆర్ రెండునెలల క్రితం ధాన్యం కొనుగోలుపై చర్చలు జరిపి, అన్ని అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రితో చర్చల్లో అంతిమంగా సానుకూల నిర్ణయం వస్తదని ఆశించాం. కానీ రెండుసార్లు జరిగిన సమావేశాల్లో ఆశాజనకంగా ఇచ్చిన హామీ ఏమీలేదు. యాసంగి వరి విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకులే గందరగోళం చేశారని గుర్తుచేయగా.. వాళ్లు తెలిసో తెలియకో మాట్లాడారని, అలా మాట్లాడొద్దని తమవాళ్లను వారించామని కేంద్రమంత్రి చెప్పారు’ అని నిరంజన్ రెడ్డి చెప్పారు.