
డబ్బులు విత్ డ్రా పరిమితిని పెంచుతూ కేంద్రం చేసిన నిర్ణయం సర్వత్రా నవ్వులపాలవుతోంది. బ్యాంకుల నుండి నాలుగు వేల రూపాయల నుండి 4500కి పెంచుతూ కేంద్రం ఆదివారం ప్రకటించింది. అదే విధంగా ఏటిఎంల్లో కూడా నగదు ఉపసంహరణ పరిమితిని పెంచింది. అలాగే వారానికి నగదు ఉపసంహరణ పరిమితిని కూడా 20 వేల రూపాయల నుండి 24వేల వరకూ పెంచింది. అయితే, ఇక్కడే ప్రభుత్వ ప్రకటనను పలువురు ఆక్షేపిస్తున్నారు. ఎందుకంటే, అసలు డబ్బే లేనపుడు నగదు ఉపసంహరణ పరిమితిని పెంచినా ఖాతాదారులకు, ప్రజలకు ఏమేరకు ఉపయోగమో అర్దం కావటం లేదు.
బ్యాంకుల్లో నగదు లేదని బ్యాంకు మేనేజర్లే చెబుతున్నారు. ఇక, ఏటిఎంలైతే మొదటి నుండి పనిచేయటం లేదు. శనివారం నుండే చాలా బ్యాంకుల్లో డబ్బులు అయిపోయాయి. పాత నోట్లను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం కొత్తగా చెలామణిలోకి తెచ్చిన 2000, 500 రూపాయలను సరిపడా చెలామణిలోకి తేలేదు. పోనీ 100, 50 రూపాయలైనా అందుబాటులోకి వుంచిందా అంటే అదీ లేదు.
కొత్త డబ్బు అందుబాటులో లేక, పాత చిన్న నోట్లు బ్యాంకుల్లో లేకపోవటంతో రోజు రోజుకు ప్రజల్లో ఆందోళన పెరిగిపోతోంది. దాంతో కేంద్ర అనాలోచిత నిర్ణయంపై సర్వత్రా మండిపడుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుండే కొత్త, పాత నోట్లు అయిపోయినట్లు చాలా బ్యాంకులు కౌంటర్లను మూసేసాయి. సాఫ్ట్ వేర్ ప్రాబ్లెం పేరుతో ఏటిఎంలు కూడా పెద్దగా పనిచేయటం లేదు. దాంతో ప్రజల ఇక్కట్లు గురించి చెప్పనలవి కాకుండా ఉంది. ఈ నేపధ్యంలో నగదు ఉపసంహరణ పరిమితిని పెంచుతున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనపై సర్వత్రా మండిపడుతున్నారు. బ్యాంకుల్లోను, ఏటిఎంల్లోను డబ్బులేనపుడు ఉపసంహరణ పరిమితిని పెంచటం వల్ల ఉపయోమేమిటని ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.