
ఢిల్లీ: తెలంగాణ రైతన్నలకు శుభవార్త. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రైతు బంధు చెక్కుల పంపిణీ నిలిచిపోతుందని ఆందోళన చెందుతున్న రైతన్నలకు కేంద్ర ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. చెక్కుల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీకి రంగం సిద్ధం కానుంది.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు పథకం కింద చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. రైతుబంధు చెక్కుల పంపిణీ పాతపథకమేనన్న కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. చెక్కుల పంపిణీకి ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలిపింది.
కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. రైతు బంధు పథకం ద్వారా రైతన్నలకు చెక్కులు పంపిణీ చేసి అండగా నిలుస్తున్నామని దాన్ని కూడా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతుందని ఆరోపించారు.
అటు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నల్గొండ జిల్లాలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద సభలో రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుందని ప్రకటించారు. రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గురువారం తెలిపారు.
రైతు బంధు చెక్కుల పంపిణీ నిలిపి వేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నిందని కేసీఆర్ ఆరోపించారు. చెక్కులు పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌నేత మర్రి శశిధర్ రెడ్డి కోర్టుకు పోతే చెంపలు వాయించి పంపిందన్నారు. రైతుల పొట్ట కొట్టొద్దని మొట్టి చెంపలు వేసిందని కేసీఆర్ తెలిపారు. రేపటి నుంచే చెక్కుల పంపిణీ చేపడతామన్నారు. ఇప్పటికే ఆయా బ్యాంకులకు చెక్కులు సిద్ధం చెయ్యాలని ఆదేశించినట్లు కేసీఆర్ తెలిపారు.
దాదాపు 50 లక్షల మంది రైతులకు రైతు బంధు చెక్కులను అందజేయనుంది ప్రభుత్వం. ఒక్కో రైతుకు రూ.4వేలు చొప్పున 6కోట్ల రూపాయలు ఇవ్వనుంది.
ఈ వార్తలు కూడా చదవండి