చెన్నూరు బాల్క సుమన్ దే: నో ఛేంజ్ అంటున్న కేటీఆర్

By Nagaraju TFirst Published Oct 5, 2018, 5:49 PM IST
Highlights

చెన్నూరు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ కు అసమ్మతి తిప్పలు తప్పడం లేదు. తాజామాజీ ఎమ్మెల్యే ఓదేలు నుంచి అసమ్మతి రాగం చల్లారిందనుకునే లోపు మాజీ ఎంపీ వివేక్ రూపంలో మరో అసమ్మతి గళం తెరపైకి వచ్చింది. బాల్క సుమన్ ను తప్పించాలని ఆసీటు తన సోదరుడికి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ వివేక్ మంత్రి  కేటీఆర్ ను కోరినట్లు సమాచారం. 

హైదరాబాద్: చెన్నూరు నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ బాల్క సుమన్ కు అసమ్మతి తిప్పలు తప్పడం లేదు. తాజామాజీ ఎమ్మెల్యే ఓదేలు నుంచి అసమ్మతి రాగం చల్లారిందనుకునే లోపు మాజీ ఎంపీ వివేక్ రూపంలో మరో అసమ్మతి గళం తెరపైకి వచ్చింది. బాల్క సుమన్ ను తప్పించాలని ఆసీటు తన సోదరుడికి ఇవ్వాలంటూ మాజీ ఎంపీ వివేక్ మంత్రి  కేటీఆర్ ను కోరినట్లు సమాచారం. చెన్నూరు బాల్క సుమన్ దేనని ఎట్టిపరిస్థితుల్లో బాల్క సుమన్ ను మార్చేది లేదంటూ కేటీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. 

చెన్నూరు అభ్యర్థిగా ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ను ప్రకటించిన వెంటనే చెన్నూరు తాజామాజీ ఎమ్మెల్యే ఓదేలు అసమ్మతి గళం విప్పారు. బాల్క సుమన్ ను తిరగినిచ్చేది లేదంటూ హెచ్చరించారు. ప్రజల మద్దతు తనకే ఉందంటూ తేల్చి చెప్పారు. 

అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన బాల్కసుమన్ కు ఓదేలు వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాల్క సుమన్ పర్యటనను వ్యతిరేకిస్తూ ఓదేలు వర్గానికి చెందిన గట్టయ్య అనే కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. 

ఈ ఘటనలో గట్టయ్యతోపాటు మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఎంపీ బాల్క సుమన్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయితే తీవ్రగాయాలపాలైన గట్టయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. 

చెన్నూరు అసెంబ్లీ టిక్కెట్ తనకు ఇవ్వకపోవడంతో తాజామాజీ ఎమ్మెల్యే ఓదేలు స్వీయ గృహనిర్భంధంలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయటకు రాలేదు. కేసీఆర్ తో తనకు అపాయింట్మెంట్ ఇప్పించాలని తనకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఓదేలు స్వీయ నిర్భంధంతో కార్యకర్తలు ఆందోళన చేశారు. 

ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఆపాయింట్మెంట్ ఇవ్వడంతో శాంతించిన ఓదేలు కేసీఆర్ తో భేటీ అయ్యారు. తనకు న్యాయం చెయ్యాలంటూ కేసీఆర్ కు మెురపెట్టుకోవడంతో ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి బుజ్జగించినట్లు సమాచారం. 

తాజాగా పెద్దపల్లి మాజీ ఎంపీ టీఆర్ఎస్ నేత వివేక్ సైతం చెన్నూరు నియోజకవర్గంలోని తన అనుచరులతో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు. చెన్నూరు టిక్కెట్ తన సోదరుడు వినోద్ కు ఇవ్వాలని కోరారు. అయితే చెన్నూరు టిక్కెట్ బాల్క సుమన్ కు కేటాయించామని ఎట్టిపరిస్థితుల్లో మార్చడం కుదరదని కేటీఆర్ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. 

సుమన్ కోసం తాము పనిచెయ్యలేమని వివేక్ అనుచరులు తేల్చి చెప్పినట్లు సమాచారం. తమ దారి తాము చూసుకుంటామంటూ వివేక్ కు స్పష్టం చేశారు. అయితే తొందర పడొద్దని కార్యకర్తలకు వివేక్ సర్ధి చెప్పారు.  

వరుస అసమ్మతులతో చెన్నూరు నియోజకవర్గంలో ఎంపీ బాల్క సుమన్ నెగ్గుకు రాగలరా అన్న అనుమానం వ్యక్తమవుతుంది. ఓదేలు రూపంలో ఒక అసమ్మతి వర్గం...ఇప్పుడు మాజీఎంపీ వివేక్ రూపంలో మరో అసమ్మతి వర్గం...ఎన్నికల సమయానికి ఇంకెన్ని అసమ్మతి వర్గాలు వస్తాయోనన్న ఆందోళన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇన్ని అవాంతరాల నడుమ బాల్క సుమన్ గెలుపు అంత ఈజీ కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. 

click me!