పార్టీ ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల బృందం భేటీ

By rajesh yFirst Published Sep 11, 2018, 8:40 PM IST
Highlights

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించింది. అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికల బృందం చర్చించింది. తెలంగాణలో ఓటర్ల సవరణ, ఎన్నికల నిర్వహణపై పార్టీ ప్రతినిధులతో చర్చించింది. 
 

హైదరాబాద్: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం బృందం తెలంగాణలో పర్యటించింది. అన్ని పార్టీల ప్రతినిధులతో ఎన్నికల బృందం చర్చించింది. తెలంగాణలో ఓటర్ల సవరణ, ఎన్నికల నిర్వహణపై పార్టీ ప్రతినిధులతో చర్చించింది. 

ఈ భేటీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి పొ.శ్రీనివాసరెడ్డి, ఎంపీ వినోద్ బృందం, కాంగ్రెస్ పార్టీ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బృందం, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ బృందం, బీజేపీ నుంచి ఇంద్రసేనారెడ్డి టీం, వైసీపీ నుంచి శివకుమార్ బృందం, సీపీఎం నుంచి డీజీ నరసింహారావు బృందం, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి బృందం, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ టీం, బీఎస్పీ నుంచి ఎల్లయ్య టీం హాజరయ్యారు. 

కేంద్ర ఎన్నికల బృందం రాజకీయ పార్టీలతో వేర్వేరుగా భేటీ అయ్యింది. ఒక్కో పార్టీకి పది నిమిషాల సమయం కేటాయించింది. మెుదట బీఎస్పీతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చించింది. భేటీలో పాల్గొన్న ఎల్లయ్య అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాలెట్ విధానాన్ని కొనసాగించాలని కోరినట్లు స్పష్టం చేశారు. వీవీ ప్యాట్స్ ల సమస్య లేకుండా ఏర్పాట్లు చెయ్యాలని, కొత్త ఓటర్ల నమోదు గడువును పెంచాలని ఈసీ బృందాన్ని కోరినట్లు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రంలో 9నెలల ముందే ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎన్నికల సంఘం వద్ద వాపోయారు. రాష్ట్రంలో 30 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ఎన్నికల సంఘానికి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని అక్కడ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో స్పష్టం చెయ్యాలని కోరారు. తొందరపాటుతో కాకుండా న్యాయపరంగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు స్పష్టం చేశారు. 

తెలంగాణలో ఓటర్ల నమోదుకు 15 రోజుల గడువు సరిపోదని బీజేపీ ప్రతినిధి ఇంద్రసేనారెడ్డి ఈసీకి తెలియజేశారు. గణేష్ నిమజ్జనం తర్వాత మరో 15 రోజులు గడువు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 

click me!