
చాందినీ జైన్ హత్య మిస్టరీ మూడు రోజుల్లో పోలీసులు ఛేదించారు. ప్రశంసలందుకున్నారు. ఇంతకీ పోలీసుల సక్సెస్ వెనక కీలకపాత్ర పోషించేదెవరో తెలుసా... రోడ్లమీద, కూడల్లలో ఎత్తయిన స్థంబాలమీద కనిపించీ కనిపించకుండా దాక్కుని అందరిమీద నిఘా వేస్తున్న పిడికెలంత కూడా లేని సిసి కెమెరా. ఈ సిసి కెమెరాలే ఈ మధ్య హైదరాబాద్ లో నేరాలను ఛేదించడంలో కీలక పాత్ర వహిస్తున్నాయి. నిన్నటి చాందినీ జైన్ హత్య నే కాదు, ఈ మధ్య కాలంలో పోలీసు ఛేదించిన ప్రతినేరంలోను సిసికెమెరాలదే కీలకపాత్ర అని ఒక పోలీసు అధికారి తెలిపారు. అమీన్పూర్ గుట్టల వద్ద చాందినీ జైన్ శవం కనిపించగానే పోలీసులు ప్రాంతంలోని సిసి కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. హంతకుడు సాయికిరణ్ చాందినీతో కలసి గుట్టల వైపు వెళ్లడం సిసి కెమెరాలలో కనిపించింది.తర్వాత ఆ దారిలో తిరిగి రాలేదు. చాందినీని హత్య చేసిన తర్వాత మరోదారిలో వెళ్లాడు. మళ్లీ ఆ దారులలో ఉన్న సిసి కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. ఈ చిత్రాలను, చాందినీ ఫోన్ నుంచి వెళ్లిన కాల్స్ తో పోల్చారు.అంతే, హంతకుడెవరో తేలిపోయింది.
సిసి కెమెరాలను పెద్ద ఎత్తున నగరంలో ఏర్పాటుచేయడంతో హైదరాబాద్ నేరాల చాలా తొందరగా తేలిపోతున్నాయి. నేరస్థులు ఈజీగా పోలీసులకు దొరికిపోతున్నారు. పోలీసుల ఏర్పాటుచేసిన సిసి కెమెరాలే కాదు, అపార్ట్ మెంట్లలో ఏర్పాటుచేసిన కెమెరాలు, దుకాణాల దగ్గిర ఏర్పాటుచేసిన కెమెరాలు నేరాల మిస్టరీని ఛేదించేందుకు ఉపయోగపడుతున్నాయి.
ఎక్కడయినా నేరం జరిగిందని సమాచారం రాగానే, పోలీసులు మొదట ఆ ప్రాంతలోని సిసి కెమెరాలన ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
అనేక కీలకమయిన కేసులు సిసి కెమెరాల వల్ల పరిష్కారమయ్యాయి. రెండేళ్ల కిందట మారెడ్ పల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి జరిగింది. అపుడు దాడిలో పాల్గొన్న వంద మందిని పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా పట్టుకున్నారు.నగరంలో చెయిన్ దొంగలను సిసి కెమెరాల వల్లే పట్టుకోగలుగుతున్నారు. ఆ మధ్య రాయదుర్గం ప్రాంతంలో రోడ్డమీద జరిగిన హిట్ అండ్ రన్ సంఘటనలో ఒక పోలీసు అధికారి మృతి చెందారు. అపుడు సిసి కెమెరాల అధారంగా మూడు నెలల్లో పోలీసులు వాహనాన్ని, ప్రమాదానికి కారణమయిన డ్రైవర్ ను పట్టుకున్నారు. మరొక కేసులో బేగంపేటలో కొంతమందినైజీరియన్లు దొంగతనం చేసి వాళ్ల దేశం పారిపోయారు. వీళ్లందరిని గుర్తించింది సిసి కెమెరాల వల్లే. అంతేందుకు, అయిదేళ్ల కిందట జరిగిన దిల్ షుక్ నగర్ జంటపేలుళ్ల నిందితులు ఎలా దొరికారనుకుంటున్నారు, కేలవం సిసి కెమెరాలు ఆ ప్రాంతమంతా నిఘా వేసినందునే...
ఇపుడు హైదరాబాద్ లో నేరం చేసిన తప్పించుకోవడం అంత సులభం కాదు. అది ట్రాఫిక్ నేరం కావచ్చు, హిట్ అండ్ రన్ నేరం కావచ్చు, చాందినీ జైన్ లాంటి హత్య కావచ్చు.... కొద్ది రోజులటూ ఇటూగా దొరికిపోవడం గ్యారంటీ.