ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నుండి ఎలాంటి సమాచారం రాలేదు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో ఏదో ఒక రోజున విచారణకు రావాలని కవిత కోరింది. కానీ ఈ విషయమై కవితకు సీబీఐ అధికారుల నుండి రిప్లై రాలేదు.
హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖకు సీబీఐ నుండి ఎలాంటి సమాధానం రాలేదు. సీబీఐ నుండి సమాచారం కోసం కవిత కార్యాలయం కూడా ఎదురు చూస్తుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద వివరణ ఇవ్వాలని కల్వకుంట్ల కవితకు ఈ నెల 2న సీబీఐ నోటీసులు పంపింది.అయితే ఈ నోటీసుకు డిసెంబర్ 6వ తేదీన ఉదయం 11 గంటల వద్ద అందుబాటులో ఉంటానని కవిత సమాచారం పంపారు. డిసెంబర్ 3వ తేదీన ప్రగతి భవన్ లో కేసీఆర్ తో కవిత సమావేశమయ్యారు. ఈ సమావేశంలో న్యాయ నిపుణులు కూడా పాల్గొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కవిత కోరారు.ఈ మేరకు సీబీఐకి లేఖ రాశారు.ఈ లేఖకు సమాధానంగా సీబీఐ పోర్టల్ లో ఈ ఎఫ్ఐఆర్ ను చూడాలని సీబీఐ కవితకు సమాచారం పంపింది.
also read:అరెస్ట్ చేస్తారని కవితకు భయం పట్టుకుంది: ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ సంచలనం
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో తన పేరు లేదని కవిత పేర్కొంది. అయినా కూడా చట్టాన్ని గౌరవించే క్రమంలో తాను సీబీఐ అధికారుల విచారణకు సహకరిస్తానని ప్రకటించారు.ఈ మేరకు ఈ నెల 5న సీబీఐకి మరో లేఖ రాశారు. తొలుత ప్రకటించిన డిసెంబర్ 6వ తేదీన సీబీఐ విచారణ సాధ్యం కాదని తెలిపింది. డిసెంబర్ 11,12, 14, 15 తేదీల్లో ఏదో ఒక రోజున తాను హైద్రాబాద్ లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత ఆ లేఖలో పేర్కొంది.ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక రోజున ఈ విషయమై విచారణకు రావాలని ఆమె కోరింది.ఈ విషయమై తనకు సమాచారం పంపాలని కోరారు. కానీ ఈ విషయమై సీబీఐ అధికారుల నుండి కవితకు ఎలాంటి సమాచారం రాలేదు. నిన్న సాయంత్రమే న్యూఢిల్లీ నుండి నలుగురు సీబీఐ అధికారులు హైద్రాబాద్ కు వచ్చారు.ఈ నలుగురు సీబీఐ అధికారులు ఎందుకు వచ్చారనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇవాళ ఉదయం 11 గగంటల వరకు హైద్రాబాద్ లోని తన నివాసంలోనే కవిత ఉంటారు. 11 గంటల తర్వాత కవిత జగిత్యాల జిల్లా టూర్ కు వెళ్లనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనకు ఆమె వెళ్లనున్నారు. రేపు కూడా జగిత్యాల జిల్లాలోనే కవిత పర్యటించనున్నారు.
కవితకు సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వడానికి మూడు నాలుగు రోజుల ముందే ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేశారు. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఈ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు.అమిత్ ఆరోరా అరెస్ట్ తో ఈ స్కాంలో అరెస్టైన వారి సంఖ్య ఆరుకు చేరింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా పలు దఫాలు సోదాలు చేశారు. ఈ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన బోయినపల్లి అభిషేక్ రావు , శరత్ చంద్రారెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే.