వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా గంగిరెడ్డి, సునీల్ యాదవ్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిలపై సంచలన ఆరోపణలు చేసింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. హత్య కేసులో ఏ2గా వున్న నిందితుడు సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సునీల్ వజ్రాల పేరుతో విలువైన రాళ్ల విక్రయాలు చేసేవాడని, వివేకా హెచ్చరించడంతో ఆయనపై కోపం పెంచుకున్నాడని సీబీఐ పేర్కొంది. గంగిరెడ్డితో కలిసి వివేకా హత్యకు ప్లాన్ చేశారని.. సీబీఐ కౌంటర్‌లో తెలిపింది. హత్యకు సంబంధించి రూ.40 కోట్లతో డీల్ కుదరడంలో సునీల్ యాదవ్ కీలకంగా వ్యవహరించాడని సీబీఐ తెలిపింది. వివేకానంద రెడ్డిని హత్య చేసిన రోజు నిందితులందరూ వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే వున్నట్లుగా సీబీఐ తన కౌంటర్‌లో తెలిపింది. అవినాశ్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసునని , అలాగే ఘటన జరిగిన ప్రదేశంలో సాక్ష్యాలను చెరిపివేయడంలో అవినాశ్ పాత్ర వుందని సీబీఐ తెలిపింది.
కాగా.. వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఈ నెల 18న సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్ ద్వారా అవినాష్ రెడ్డికి నోటీసులు పంపారు. ఇప్పటికే ఇక ఈ కేసుకు సంబంధించి గత నెల 28న అవినాష్ రెడ్డి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.
ALso REad: వైఎస్ వివేకా హత్య కేసు.. అవినాష్ రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు, 24న విచారణకు రావాలని ఆదేశం
దాదాపు 4 గంటల పాటు ఆయనను సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సీబీఐ అధికారులు చెప్పారని అన్నారు. కొంతమంది దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో సీబీఐకి సహకరిస్తానని ఆయన తెలిపారు. తనకు తెలిసిన అన్ని విషయాలను సీబీఐ అధికారులతో పంచుకున్నానని.. అయితే విచారణను వీడియో రికార్డింగ్ చేయాలని కోరగా అందుకు వారు అంగీకరించలేదని అవినాష్ రెడ్డి వెల్లడించారు.
ఇదిలావుండగా.. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఫిబ్రవరి 16న తెలంగాణ హైకోర్టులో వివేకా సతీమణి సౌభాగ్యమ్య ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. 2019, మార్చి 15 తెల్లవారుజామున వివేకా హత్యకు గురయ్యారని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. పులివెందుల పీఎస్‌లో కేసు నమోదు చేశారని..దీనిని సీబీఐకి బదిలీ చేయాలని తాము హైకోర్టులో పిటిషన్ వేసినట్లు సౌభాగ్యమ్మ తెలిపారు. 2020 మార్చి 11న కేసును సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు తీర్పు వెలువరించిందని ఆమె వెల్లడించారు. సీబీఐ దర్యాప్తు చేపట్టి నేర అభియోగ పత్రాలు దాఖలు చేసిందని.. సీబీఐ అధికారులు ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారని వివేకా భార్య పేర్కొన్నారు.
అందులో ఏ2గా సునీల్ యాదవ్ వున్నారని.. సునీల్ యాదవ్ సహ నిందితులు దర్యాప్తు, విచారణను ప్రభావితం చేశారని ఆమె పిటిషన్‌లో ప్రస్తావించారు. కేసును ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారని సౌభాగ్యమ్మ వెల్లడించారు . 2022 నవంబర్ 29న విచారణను నాంపల్లి సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తూ తీర్పు వచ్చిందన్నారు. సీబీఐ కోర్ట్ గత నెల విచారణకు స్వీకరించిందని.. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కీలక పాత్ర పోషించారని ఆమె పేర్కొన్నారు. బెయిల్ కోసం పిటిషన్ కూడా దాఖలు చేశాడని.. బెయిల్ ఇవ్వొద్దని ఇంప్లీడ్ పిటిషన్ వేసే హక్కు బాధితులకు వుంటుందని సౌభాగ్యమ్మ వెల్లడించారు. వైఎస్ వివేకా హత్య తర్వాత నిందితుల వల్ల.. తాను , తన కుమార్తె ఎంతో మానసిక క్షోభ అనుభవించామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.