కుల గణన క్రెడిట్ రాహుల్ గాంధీదే...: రేవంత్ రెడ్డి

Published : May 01, 2025, 12:34 PM ISTUpdated : May 01, 2025, 12:44 PM IST
కుల గణన క్రెడిట్ రాహుల్ గాంధీదే...: రేవంత్ రెడ్డి

సారాంశం

కేంద్ర ప్రభుత్వ కులగణన నిర్ఱయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ క్రెడిట్ మొత్తం తమ నాయకుడు రాహుల్ గాంధీకే దక్కుతుందని పేర్కొన్నారు. కుల గణన విషయంలో కేంద్రం తమ సలహాలు తీసుకోవాలని రేవంత్ కోరారు. 

Caste Census : తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టినా... కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని ప్రకటించినా ఆ క్రెడిట్ మొత్తం ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీదే అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పాదయాత్ర కారణంగానే కుల గణనపై చర్చ జరిగిందని... ఈ డిమాండ్ కు కేంద్రం తలొగ్గక తప్పలేదన్నారు.  కులగణన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడమే కాదు తమతో చేయించారని రేవంత్ అన్నారు.., అందువల్లే కేంద్రం కదిలిందని రేవంత్ అన్నారు.  

జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజల గుండెచప్పుడు విన్నారు... అప్పుడే కులగణన చేస్తామని హామీ ఇచ్చారన్నారు.  కులగణన సమాజానికి ఎక్స్ రే లాంటిదని రాహుల్ గాంధీ ఆనాడే చెప్పారు... ఆయన చెప్పిందే జరుగుతోందని అన్నారు. ఆయన సూచనలతోనే తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేసారు. 

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కుల గణనపై అసెంబ్లీలో రెండు తీర్మాననాలు చేసి కేంద్రానికి పంపినట్లు రేవంత్ తెలిపారు. జనగణనతో పాటే కులగణన చేపట్టాలని... రిజర్వేషన్లలో 50 శాతం పరిమితిని తొలగించాలని తీర్మానం పంపామన్నారు. జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలతో కలిసి ధర్నా చేపట్టినట్లు రేవంత్ తెలిపారు. మా ఒత్తిడికి తలొగ్గి ప్రధాని మోదీ కులగణనపై నిర్ణయం తీసుకున్నారని రేవంత్ అన్నారు. 

కులగణన చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అయితే జన గణనతో పాటే కులగణన ఎప్పటిలోగా పూర్తి చేస్తారో ప్రధాని చెప్పాలన్నారు. కులగణనకు అనుసరించే విధానాలపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని కోరారు. ఇందుకు కేంద్ర మంత్రులతో కూడిన కమిటీతో పాటు, అధికారులతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టే క్రమంలో విధి విధానాలు రూపొందించి ప్రజలముందు పెట్టిందని... కేంద్రం కూడా అలాగే చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో మేం 57 ప్రశ్నలతో 8 పేజీలతో కూడిన సమాచారాన్ని సేకరించామని... అన్ని రాజకీయ పార్టీలను భాగస్వాములను చేశామన్నారు. ఎక్కడా పార్టీ కార్యక్రమంలా చేయలేదన్నారు. అందరినీ భాగస్వామ్యం చేసి కులగణన పూర్తి చేశామని రేవంత్ రెడ్డి అన్నారు.  

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశంలోనే ముందు వరుసలో నిలిచిందని రేవంత్ అన్నారు. కులగణనలో దేశానికి తెలంగాణ ఓక మోడల్ గా నిలిచిందన్నారు. తాము చేపట్టిన కులగణనపై కేంద్రంతో  అనుభవాన్ని పంచుకోవడానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. ఎలాగైనా బలహీన వర్గాలకు మేలు జరగాలనేదే తమ సంకల్పంగా రేవంత్ పేర్కొన్నారు. 

రాహుల్ గాంధీ ఆలోచనలను అమలు చేసేందుకు ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో తమ ప్రభుత్వం కులగణన చేసి చూపించిందన్నారు. తమను విమర్శించే బీజేపీ నేతలను ఒకటే అడుగుతున్నా… పదేళ్లుగా అధికారంలో ఉన్నా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయలేదని.  రాష్ట్ర బీజేపీ నేతలు రాజకీయ లబ్ది కోసమే తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. 

రేవంత్ రెడ్డి విధానాలను మోదీ అనుసరిస్తున్నారనే బాధ తెలంగాణ బిజెపి నాయకుల్లో కనిపిస్తోందని అన్నారు. స్థానిక బీజేపీ నాయకులలో అసూయ, అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. తెలంగాణ మోడల్ దేశానికి రోల్ మోడల్ గా నిలిచిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?