నిధుల గోల్ మాల్ పై హైకోర్ట్ సిట్టింగ్ జడ్జితో విచారణ... తెలుగు అకాడమీ తెలంగాణ ఉద్యోగసంఘం డిమాండ్

By Arun Kumar PFirst Published Sep 30, 2021, 10:16 AM IST
Highlights

 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో వున్న తెలుగు అకాడమీలో కోట్లల్లో నిధులు మాయమవడంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అకాడమీ తెలంగాణ ఉద్యోగులు కోరుతున్నారు. 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో వున్న తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ ఇరు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారింది. అయితే కోట్లల్లో అకాడమీ నిధులు మాయమవడంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేయించి వాస్తవాలు వెలుగులోకి తీసుకుని రావాలని తెలంగాణ తెలుగు అకాడమీ ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నిధులను కాపాడాల్సిన అకౌంట్స్ ఆఫీసర్, పరిపాలనాధికారి యస్. రమేష్ ను వెంటనే పదవి నుండి తప్పించి విచారణ కమిటీ వేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

అకాడమీ చరిత్రలోనే మొదటిసారి ఇలా నిధులు మాయమైన ఘటన చోటుచేసుకుంది. అకాడమీ విభజన కొలిక్కి వచ్చిన చివరి తరుణంలో భారీ మొత్తంలో అవకతవకలు (రూ.50కోట్లు) జరిగాయన్న వార్త తెలుగు బాషాభిమానులతో పాటు యావత్ తెలంగాణ విద్యార్థి లోకాన్ని అయోమయంలో పడేసిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

కొద్ది రోజులుగా అకాడమీ సంచాలకులు, అకౌంట్స్ అధికారితో పాటు ఒక ఆంధ్ర ప్రాంత ఉద్యోగి(పి. ఆంజనేయులు) మధ్య ఈ అవకతవకలపై గోప్యంగా చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయం అకాడమీలో పనిచేసే మిగతా ఉద్యోగులకు కూడా తెలియకుండా చర్చలు గోప్యంగా జరుగుతున్నాయి. నిధుల గోల్ మాల్ గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్తగా వ్యవహరించారని అకాడమీ ఉద్యోగసంఘం పేర్కొంది. 

READ MORE  తెలుగు అకాడమీలో రూ.43 కోట్ల నిధుల గోల్‌మాల్.. తెలంగాణ సర్కార్ సీరియస్, విచారణకు కమిటీ

''ఈ నిధుల అవకతవకల విషయంలో నిజంగానే అకౌంట్స్ అధికారి తన తప్పు లేనట్లయితే నైతిక బాధ్యత వహించి పారదర్శకంగా పదవి నుండి తప్పుకోవాలి. కానీ అలా చేయకుండా జరిగిన తప్పును కప్పి పుచుకోవడానికి విఫలప్రయత్నం చేశారు. ఈ విషయంలో  అకౌంట్స్ అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించి శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని తెలుగు అకాడమీ సంచాలకులను కోరినా సదరు అధికారిపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కించడం పలు అనుమానాలకు తావిస్తోంది'' అని అకాడమీ ఉద్యోగ సంఘం నాయకులు పేర్కొన్నారు. 

''తెలుగు అకాడమీ స్థాపన నాటి నుండి ఉద్యోగులు ఎంతో కష్టపడి అకాడమీని ఈ స్థాయిని తీసుకురావడానికి  పాటుపడ్డారు. ఇలాంటి కొంతమంది అధికారుల చర్యల వల్ల వేలాది విద్యార్థులతో పాటు, అకాడమీ మనుగడపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి అకాడమీ నిధుల గోల్ మాల్ పై ఉన్నత స్థాయి కమిటీ వేసి సంస్థ కాపాడాల్సిందిగా కోరుతున్నాము'' అని తెలంగాణ తెలుగు అకాడమి ఉద్యోగుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. 

         
  

click me!