మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా తేల్చిన కోర్టు

By Sumanth Kanukula  |  First Published Mar 22, 2022, 5:05 PM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు (Sircilla Rajaiah) భారీ ఊరట లభించింది. తన కోడలు, ఆమె పిల్లలు మృతికి సంబంధించి రాజయ్యపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది.


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు (Sircilla Rajaiah) భారీ ఊరట లభించింది. తన కోడలు, ఆమె పిల్లలు మృతికి సంబంధించి రాజయ్యపై నమోదైన కేసును కోర్టు కొట్టివేసింది. 2015లో సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు పిల్లలతో సహా ఇంట్లోనే సజీవ దహనం కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రాజయ్య కుమారుడు అనిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రాజయ్య, ఆయన భార్య మాదవిలు కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే తాజాగా ఈ కేసులో ముగ్గురిని కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 

ఇక, సిరిసిల్ల రాజయ్య కొడుకు అనిల్, సారిక ఇద్దరు క్లాస్‌మేట్స్. వారిద్దరు ఇంజనీరింగ్‌ చేస్తున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఈ క్రమంలోనే 2002లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత సారిక తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే కొంతకాలానికి తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ సారిక రాజయ్య ఇంటి ఎదుట ఆందోళన నిర్వహిచింది. 2014 ఏప్రిల్‌లో ఆమె బేగంపేట పోలీస్ స్టేషన్‌లో భర్త అనిల్ కుమార్, అత్తమామలు రాజయ్య, మాధవిలపై క్రిమినల్ ఫిర్యాదు చేసింది. తన భర్త, అత్తమాలు వేధింపులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. 

Latest Videos

అయితే 2015 నవంబర్‌లో హన్మకొండలోని నివాసంలో సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనం అయ్యారు. ఈ విషయం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. ఇంట్లో నుంచి సారిక.. ఆమె ముగ్గురు పిల్లలు అభినవ్ (7), కవలలు అయాన్, శ్రియాన్‌ల మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. అయితే గదిలో ఎల్‌పీజీ సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి ఉన్నట్టుగా గుర్తించినట్టుగా పోలీసులు చెప్పారు. అయితే సారిక మృతి తర్వాత అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. 

సారిక ఆత్మహత్య చేసుకోలేదని.. అత్తింటివారే చిత్రహింసలకు గురిచేసి చంపారని ఆమె బంధువులు ఆరోపించారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్‌పై కేసు నమోదు చేసుని దర్యాప్తు చేపట్టారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు బెయిల్‌పై బయటకొచ్చారు. అయితే తాజాగా ఈ కేసులో ముగ్గురిని నాంపల్లి కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 
 

click me!