
అడ్డగోలు నిబంధనలు పెడుతూ గురుకుల పోస్టులు పడ్డాయన్న ఆనందం కూడా లేకుండా చేసింది టీఎస్ పీయస్సీ. అయితే అభ్యర్థుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తడం, విద్యార్థిసంఘాలు పెద్ద యెత్తున్న ఉద్యమించడంతో ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి కార్యాలయం సమీక్ష జరిపి నిబంధనలను సడలించాలని టీఎస్ పీయస్సీకి సూచించింది.
అయితే అసలు నిబంధన, ముఖ్యంగా అభ్యర్థులను భయపెడుతున్న నిబంధన మాత్రం అలాగే ఉంది. దీనిపై సీఎం కూడా పట్టువీడటం లేదు.
ఇంగ్లీష్ మీడియంలోనే పరీక్ష ఉంటుందని, గతంలోనే సుప్రీం కోర్టు ఈ విషయంపై స్పష్టతం కూడా ఇచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
ఎన్.సి.టి.ఇ మార్గదర్శకాలు, గతంలో న్యాయస్థానాల తీర్పుల మేరకు ఏ మీడియం విద్యార్థులకు ఏ మీడియంలో బోధించడానికి నియమాకాలు జరుగుతున్నాయో అదే భాషలో పరీక్ష నిర్వహించాలని గతంలో సుప్రిం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని సీఎంవో కార్యాలయం మీడియాకు విడుదల చేసిన లేఖలో పేర్కొంది.
అయితే అన్ని నిబంధనల్లో సడలింపు ఇచ్చిన సీఎం కేసీఆర్ ఈ ఒక్క ఇంగ్లీష్ నిబంధన కూడా సడలిస్తే తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగి ఉండేదని అభ్యర్థులు అంటున్నారు.
ఇంగ్లీష్, తెలుగు కలిపి ద్విభాషలో పరీక్ష పత్రం ఇచ్చినా బాగుంటుందని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని పేపర్లను దాదాపు రెండు భాషల్లోనూ ఇస్తుందని గుర్తు చేశారు. ఇదే నిబంధనల గురుకుల పోస్టుల పరీక్షల కూడా వర్తింప చేయాలని కోరుతున్నారు.