హరీష్ రావుకు వైద్యారోగ్య శాఖ కీలక బాధ్యత... కేసీఆర్ కేబినెట్ నిర్ణయం

By Arun Kumar PFirst Published Jun 9, 2021, 12:49 PM IST
Highlights

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటుచేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

హైదరాబాద్: కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికల నేపధ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనిపై నిన్న జరిగిన క్యాబినెట్ లో చర్చ జరిగింది.   

ఈ ఆరోగ్య సబ్ కమిటీకి ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షునిగా వ్యవహరించనున్నారు. మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారు.

read more  లాక్‌డౌన్ పొడిగింపు, రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలివే..!!

ఈ కమిటీ సభ్యులు దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నటువంటి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేయనున్నారు. అలాగా ఉత్తమమైన ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెల్లి అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది. 

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరో థర్డ్ వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన మౌలిక వసతులను సిబ్బందిని ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

read more పిల్లలకోసం 4 వేల బెడ్స్: కరోనాపై హైకోర్టుకు తెలంగాణ సర్కార్ నివేదిక

మరోవైపు రేషన్ డీలర్ల కమీషన్, ఇతర సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించారు కేసీఆర్. ఈ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, సబిత, ఇంద్రకరణ్ రెడ్డిలు సభ్యులుగా వుంటారు.  

 అలాగే దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,46,169 మంది అర్హులకు రేషన్‌ కార్డులను అధికారులు జారీ చేయనున్నారు. ఈ మేరకు 15 రోజుల్లో రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.    

వర్షాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ సంసిద్ధతపైనా కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై మంత్రిమండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది కోటికిపైగా ఎకరాల్లో మూడుకోట్ల టన్నుల వరి దిగుబడి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. సాకుగు కృషి చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్‌ అభినందించింది. అలాగే రానున్న వర్షాకాలం సాగు కోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.  

 

  

click me!