
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విరుచుపడ్డారు. ఆయనకు ధాన్యం సేకరణపై కనీస అవగాహన లేదని అన్నారు. వరికి, గోధుమలకు తేడా ఏంటో తెలియదని విమర్శించారు. వార్డు మెంబర్ కంటే తక్కువగా దిగజారి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల ధాన్యం పండించిన ధాన్యం ఎప్పటి మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో తాము ఢిల్లీలో చేపట్టిన ధర్నా విజయవంతం అయ్యిందని అన్నారు. తమ ధర్నా తరువాత ఎన్నడూ లేదని ఎఫ్‌సీఐ అధికారి పాండే తెలుగు మీడియాతో మాట్లాడారని చెప్పారు. పీఎంవో ఆదేశాలతోనే తెలంగాణలో బీజేపీ హైదరాబాద్ లో ధర్నా చేపట్టిందని అన్నారు. ఈ ధర్నాలో బండి సంజయ్ పిచ్చి కుక్కలా మాట్లారని పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
సంజయ్ వార్డు మెంబర్ స్థాయి కన్నా తక్కువగా దిగజారి మాట్లాడారని అన్నారు. ధాన్యం సేకరణ ఎలా జరుగుతుందో కూడా బండి కి కనీస అవగాహన లేదని తెలిపారు. పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని ఎఫ్ సీఐ అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. రైతులను వరి వేయాలని రెచ్చగొట్టింది బీజేపీ నాయకులే అని అన్నారు. కేంద్రంతో ధాన్యంతో కొనిపిస్తామని చెప్పి, ఇప్పుడు మొహం చాటేసింది వారేనని చెప్పారు. వరి ధాన్యానికి, గోధుమలకు తేడా ఏంటో బండి సంజయ్ కు తెలియదని అన్నారు. పీఎంవో పంపించిన గోధుమల చిత్రాన్నిఅవగాహన లేకుండానే ఫ్లెక్సీల్లో పెట్టారని అన్నారు.
తెలంగాణ ప్రజలు నూకలు తినాలని పీయూష్ గోయల్ అంటే ఆత్మగౌరవం లేకుండా కేంద్రానికి వత్తాసు పలికింది బండి సంజయ్ అని అన్నారు. ఆయన గుజరాత్ కు గులాంగా మారారని ఆరోపించారు. రైతులకు రెండింతల ఆదాయం రాలేదు కానీ రెండింతల సమస్యలు వచ్చాయని విమర్శించారు. బీజేపీ గుజరాత్ లో రైతులకు ఎనిమిది గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని, కానీ తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంట్ లో చెప్పారని గుర్తు చేశారు.
ఆదానీ కోసమే బీజేపీ వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చిందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మోడీ, అమిత్ షాలకు వత్తాసు పలకడం తప్ప బండి సంజయ్ కు ఇంకా ఏమీ తెలియదని అన్నారు. ఎగుమతుల పాలసీ ఏంటో కూడా ఆయనకు తెలియదని అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఆఫీసు ఎదుటే ఆ పార్టీ వాళ్లను తమ నాయకులు ఉరికించారని అన్నారు. కల్లాల దగ్గరకు వెళితే సంజయ్ ను రైతులే ఉరికించారని చెప్పారు. తనపై ఈడీ, ఐటీ దాడులు జరిపించాలని సవాల్ విసిరారు. ఇక నుంచి బీజేపీ నాయకులకు ధీటుగా బదులిస్తామని అననారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు కూడా పాల్గొని మాట్లాడారు. సోమవారం ఢిల్లీలో జరిగిన ధర్నా విజయవంతం అయ్యిందని, అందుకే బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని చెప్పారు. ఒకటి, రెండు చోట్ల గెలిస్తే బీజేపీ నేతలు ఎగిరిపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ సాధించిన విజయాల ముందు బీజేపీ సాధించిందని ఎంతని ప్రశ్నించారు. బీజేపీ తన సిట్టింగ్ గ్రాడ్యుయేట్ స్థానం కోల్పొయిందని, హుజూర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయని అన్నారు.
కాంగ్రెస్ బీజేపీ కి అమ్ముడు పోయిందని గువ్వల బాలరాజు అన్నారు. ఢిల్లీ స్థాయి లో రైతుల కోసం ఎలాంటి ఆందోళన చేసిందని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేతకాని తనం వల్లనే బీజేపీ గెలిచిందని అన్నారు. రాహుల్ గాంధీకి మోడీని ఎదుర్కొనే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. అంబేద్కర్ జయంతి రోజున బండి సంజయ్ పాద యాత్ర మొదలు పెట్టడం అంటే ఆ మహనీయుడి ఆత్మను క్షోభ పెట్టడమే అవుతుందని అన్నారు. బండి సంజయ్ ను రైతులే నిలదీస్తారని అన్నారు. మత కల్లోలాలు రేపడం తప్ప బీజేపీ కి ఏం చేతకాదని ఆరోపించారు.
అనంతరం పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ అంటే ‘బుద్ది జ్ఞానం లేని పార్టీ’ గా మారిందని ఆరోపించారు. సోమవారం నాడు నిర్వహించిన ధర్నా తరువాత ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. రైతుల కడుపు మండే నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటి ఎదుట వడ్లు కుప్పలుగా పోశారని అన్నారు. ఏ ఉద్యమం అయినా ఆర్మూర్ నుంచి ప్రారంభం కావాల్సిందేనని అన్నారు.
బీజేపీ నాయకులపై రైతులు యుద్దం ప్రకటించారని అన్నారు. బండి సంజయ్ తిరుగు బోతు, అరవింద్ వాగు బోతు గా మారిపోయారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీజేపీ ఎంపీలతో తెలంగాణ కు ఎలాంటి లాభమూ లేదని అన్నారు. గోధుమలు వడ్లకు తేడా తెలియదని అన్నారు. సీఎం కేసీఆర్ గురించి నీచంగా మాట్లాడితే బీజేపీ నేతలు హైదరాబాద్ లో తిరగలేరని అన్నారు. .హైద్రాబాద్ లో శాంతి భద్రతల సమస్య తలెత్తితే బీజేపీ నేతలదే బాధ్యత అని అన్నారు.