
నగరంలోని నానక్ రామ్ గూడలో నిన్న రాత్రి హఠాత్తుగా ఏడు అంతస్తుల భవనం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ అక్రమ నిర్మాణంపై ఇప్పుడు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఒక వైపు సహాయ చర్యలు చేపడుతూనే మరోవైపు నిర్మాణంలో వెలుగుచూసిన లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై విచారణ చేపట్టింది.
మరోవైపు భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ముగ్గరు మరణించారు. శిథిలాల కింద మరో 10 వరకు ఉండే అవకాశం ఉంది.
ఐదు కుటుంబాలకు చెందిన 13 మంది కూలిన భవనంలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగరంకు చెందిన మూడు కుటుంబాలకు చెందిన 9 మంది ఈ శిథిలాల కింద ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.
కూలిన భవనానికి జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతుల్లేవు. బిల్డింగ్ యజమాని సత్యనారాయణసింగ్ అలియాస్ సత్తుసింగ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సత్తుసింగ్ గడిచిన రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో గుడుంబా వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది.
అధికారులను బెదిరించడం, దాడులు చేయడం వంటి చర్యల కారణంగా సత్తుసింగ్‌పై ఇప్పటికే పలు పీఎస్‌లలో క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయి.
కాగా, ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. క్షతగాత్రులకు లక్ష రూపాయల నష్టపరిహారంతో పాటు మెరుగైన వైద్య సహాయం అందిస్తామని తెలిపింది.
మరోవైపు ఈ ఘటనకు సంబంధించి శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్ మనోహర్, టౌన్‌ప్లానింగ్ ఏసీపీ కృష్ణమోహన్‌లను బాధ్యులుగా చేస్తూ సస్పెండ్ చేసినట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ లో ప్రకటించారు.