
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే సేకరించిన ఆధారాలు, నిందితుల వాంగ్మూలాల ఆధారంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావులతో పాటుగా పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు కవిత ఈడీ విచారణకు సంబంధించిన వివరాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ నుంచి ఎప్పటికప్పుడూ సమీక్షిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఉన్న బీఆర్ఎస్ నేతలతో టచ్‌లో ఉంటూ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు మరికొందరు బీఆర్ఎస్ నేతలకు కూడా ఢిల్లీకి వెళ్లాల్సిందిగా ఆదేశాలు వెళ్లినట్టుగా సమాచారం.
ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఢిల్లీలో ఉండగా.. మరికొందరు నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు హుటాహుటిన ఒకవేళ ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేసిన పక్షంలో ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ అధినాయకత్వం నిర్ణయించింది.
Also Read: ఢిల్లీలో బీఆర్ఎస్ నిరసన.. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం..
ఈ క్రమంలోనే ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఆప్ నేతల సహకారం కూడా తీసుకుని నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో బీఆర్ఎస్ అధినాయకత్వం ఉంది. కవితను అరెస్ట్ చేసిన పక్షంలో.. ఈడీ కార్యాలయం ఎదుట మంత్రలు, ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసన చేపట్టే విధంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తోంది.
ఇక, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు ఆమెను విచారిస్తున్నారు. ఐదుగురు అధికారులతో కూడిన ఈడీ బృందం కవితను ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ విచారణ సాగుతుంది. మహిళా అధికారి సమక్షంలోనే కవిత విచారణ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక, ఢిల్లీ స్కామ్ కేసులో ఇదివరకే కస్టడీలోకి తీసుకున్న అరుణ్ రామచంద్ర పిళ్లై, మనీష్ సిసోడియాను కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. ఇక, ఈడీ విచారణకు వెళ్తున్న సమయంలో కవిత.. బీఆర్ఎస్ శ్రేణులకు పిడికిలి బిగించి అభివాదం చేశారు.