హైదరాబాద్ బాలానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. శివప్రసాద్ అనే బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు మందలించడం వల్లే అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ నార్సింగ్‌లో ఇంటర్ విద్యార్ధి సాత్విక్ ఆత్మహత్య ఘటన నుంచి తేరుకోకముందే తెలుగునాట పలువురు విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిన్న ఖమ్మం శ్రీచైతన్య కళాశాలలో ఓ విద్యార్ధిని కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ బాలానగర్‌లో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని శివప్రసాద్‌గా గుర్తించారు. బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతోనే సదరు విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని శివప్రసాద్ రాసిన సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
అంతకుముందు వికారాబాద్ జిల్లాలోని చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో దారుణం చోటుచేసుకుంది. స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న విద్యార్థి కార్తీక్ అస్వస్థతకు గురై చనిపోయాడు. అయితే టీచర్ కొట్టడంతో కార్తీక్ అస్వస్థతకు గురయ్యాడని.. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని అతడి తల్లిదండ్రులు చెబుుతన్నారు. వివరాలు.. మొయినాబాద్ మండలం పెద్ద మంగలారంకు చెందిన కార్తీక్ చిలాపూర్‌లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. అయితే సాత్విక్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
తన కొడుకుని టీచర్ కొట్టడంతోనే అస్వస్థతకు గురై మృతి చెందాడంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవు కోసం స్కూల్‌కు పంపితే టీచర్ ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్తీక్‌ను టీచర్ కొట్టారనే వార్తలపై స్పందించిన కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం.. సాత్విక్ బెడ్‌పై నుంచి పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.