Hyderabad: శనివారం మధ్యాహ్నానికల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయనీ, ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండరని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించటంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్), ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. పలు ప్రతిపక్ష పార్టీలు సైతం ప్రభుత్వం నడుచుకుంటున్న తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
BSP Telangana president RS Praveen Kumar: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. శనివారం మధ్యాహ్నానికల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు పోతాయనీ, ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండరని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించటంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్), ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్) తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. పలు ప్రాంతాల్లో నిరసనలను విరమించినట్టు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి రాజ్యాంగ విరుద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జేపీఎస్ పట్ల ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నాలుగేళ్లు పని చేసిన జేపీఎస్ పట్ల వివక్ష చూపడం సరికాదని సీఎంకు స్పష్టం చేశారు.
ఆందోళన చేస్తున్న జేపీఎస్ శనివారం మధ్యాహ్నానికల్లా విధులకు హాజరు కాకపోతే కొత్తగా జేపీఎస్ ల నియామకం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూ, ఈ ఉత్తర్వులు క్రూరమైన చర్యగా అభివర్ణించారు. ఓ వైపు రాష్ట్ర యువత జీవితాలతో చెలగాటం ఆడుతూనే మరోవైపు దోపిడీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
వరంగల్ జిల్లాలో మహిళా జెపిఎస్ బియారీ సోనీ ఆత్మహత్యను ప్రస్తావిస్తూ ఆమె ఆత్మకు నివాళులు అర్పించేందుకు అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు అన్ని గ్రామాల్లో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో "ఒక్కరి కోసం అందరం- అందరి కోసం ఒక్కరం" అనే నినాదంతో ముందుకు సాగాలని కోరారు.
అలాగే, తెలంగాణ రాష్ట్రమస్తే కాంట్రాక్టు ఉద్యోగుల పద్ధతే ఉండదని అందరినీ రెగ్యులరైజ్ విధానంలో ఉద్యోగ భద్రత కల్పిస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రకటించిన కేసీఆర్, తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి ఉద్యోగుల ప్రాణాలతో, జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి సిగ్గుచేటని రాష్ట్ర బీఎస్పీ అధికార ప్రతినిధి జక్కని సంజయ్ కుమార్ అన్నారు. పంచాయతీ కార్యదర్శులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న ఉద్యమంలో కేసీఆర్ మొండి వైఖరిని తాము ఖండిస్తున్నట్టు తెలిపారు. పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యగానే బీఎస్పీ భావిస్తున్నదని పేర్కొన్నారు.