
హైదరాబాద్: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌లోని ఓ ఇంట్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీగా హవాలా నగదు బయటపడింది. దీంతో పోలీసులు ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వివరాలు.. శ్రీనివాస్ అనే వ్యక్తి ఓ కంపెనీలో డీజీఎంగా పనిచేస్తున్నాడు. గవర్నమెంట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ బిజినెస్ కూడా చేస్తున్నాడు. రెజిమెంటల్ బజార్‌లో అతనికి చెందిన ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎక్కువగా వుడ్ ఫర్నిచర్ ఉండడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పినట్టుగా చెబుతున్నారు. అగ్ని ప్రమాదం తర్వాత ఇంట్లో రూ. కోటి 64 లక్షల 45 వేల నగదు, బంగారం, వెండి లభ్యమైంది. ఈ మొత్తాన్ని సీజ్ చేసిన పోలీసులు..ఐటీ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ నగదును హవాలా మనీగా అనుమానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని చెబుతున్నారు.