ఓట్ల లెక్కింపులో తేడా జరిగింది..కోర్టుకెక్కిన మల్‌రెడ్డి రంగారెడ్డి

By sivanagaprasad KodatiFirst Published Dec 22, 2018, 3:39 PM IST
Highlights

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో లోపాలున్నాయంటూ ప్రతిపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. 

తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో లోపాలున్నాయంటూ ప్రతిపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్‌రెడ్డి రంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఓట్లకు సంబంధించిన అన్ని వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు గురించి రంగారెడ్డి తరపున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాకేశ్ ముంజాల్ శుక్రవారం చీఫ్ జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావనకు వచ్చింది.

దీనిపై స్పందించిన ధర్మాసనం, కేంద్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది అవినాశ్ దేశాయ్‌ని అడిగింది. అయితే ఈ పిటిషన్ గురించి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో  విచారణ సమయానికి అవినాశ్ న్యాయస్థానానికి హాజరు కాలేదు.

దీంతో ధర్మాసనం పిటిషనర్ అభ్యంతరాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమకు తెలియజేయాల్సిందిగా అవినాశ్‌కు స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. దీనిపై మాట్లాడిన రంగారెడ్డి ఈ నెల 11న ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, ఆ ఓట్ల లెక్కింపులో లోపాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన చీఫ్ ఎన్నికల ఏజెంట్ వినతిపత్రం సమర్పించారన్నారు.

పోలీంగ్ స్టేషన్ 199, 221ల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను, ఈవీఎంలను పోల్చిచూడగా, ఈవీఎంల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి 146 ఓట్లు, తనకు 130 ఓట్లు వచ్చాయని, ఇదే సమయంలో వీవీ ప్యాట్‌లను లెక్కించగా... మంచిరెడ్డికి 139 ఓట్లు, తనకు 129 ఓట్లు వచ్చాయన్నారు.

221 పోలింగ్ కేంద్రంలో కూడా ఈవీఎం ఓట్లకు, వీవీ ప్యాట్ స్లిప్పులకు తేడాలున్నాయని తెలిపారు. వీటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా పట్టించుకోకుండా రిటర్నింగ్ అధికారి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఫలితాలను ప్రకటించారని పేర్కొన్నారు.

అయితే మాక్ పోలింగ్ డేటాను డిలీట్ చేయకుండా వీవీ ప్యాట్‌‌లను లెక్కించడం వల్ల సమస్య వచ్చిందని రిటర్నింగ్ అధికారి చెప్పారన్నారు. సమాచార హక్కు చట్టం కింద ఇందుకు సంబంధించిన సమాచారం కోరగా.... రిటర్నింగ్ అధికారి కార్యాలయం కీలక సమాచారాన్ని తొక్కిపెట్టిందని తెలిపారు.

ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు వీవీ ప్యాట్‌లను తీసుకువచ్చారని, అయితే అధికారులు మాత్రం పారదర్శకంగా వ్యవహరించడం లేదని రంగారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోర్టును అభ్యర్థించారు మల్‌రెడ్డి రంగారెడ్డి.
 

click me!