అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చాల్సింది : కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 7, 2024, 5:00 PM IST
Highlights

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వుంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఇంకా కోలుకోలేదు. ఓటమి తాలూకూ పరాభవం వారిని వెంటాడుతూనే వుంది. అలా చేసి వుంటే బాగుండేది, ఇలా చేస్తే గెలిచేవాళ్లమేమోనంటూ గులాబీ నేతలు చెబుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని తెలంగాణ భవన్‌లో ఆదివారం జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. 

ఈ క్రమంలో తారక రామారావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వుంటే బాగుండేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మూడింట ఒక వంతు సీట్లు గెలిచామని, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ అప్రతిష్ట మూటగట్టుకుందని , ఆ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఒత్తిడి పెంచుతామని రామారావు అన్నారు. 

Latest Videos

పార్లమెంట్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగనుందని, పరిస్థితులు బీఆర్ఎస్‌కే అనుకూలంగా వున్నాయని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జిల్లాల సంఖ్యను తగ్గించేందుకు కమీషన్ వేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని.. అలా చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని తారక రామారావు ప్రశ్నించారు. 

click me!