వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు. ధరణిని రద్దు చేయాలా, వద్దా అని ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. కుమరంభీమ్ ఆసిఫాబాద్ లో పలు కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు.
ఆసిఫాబాద్: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో ఎలాంటి అపనమ్మకం లేదన్నారు.తనపై మీరు చూపిన ప్రేమే వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పడానికి నిదర్శనమని సీఎం తెలిపారు. రానున్న రోజుల్లో ఐకమత్యంగా ముందుకు సాగి రాష్ట్రాన్ని మరింత అభివృద్ది చేస్తామన్నారు కేసీఆర్.
కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ శుక్రవారంనాడు ప్రారంభించారు. అనంతరం ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో ఆయన ప్రసంగించారు.
అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్న విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు.ధరణిని ఎత్తివేస్తే మళ్లీ పైరవీకారులు, లంచగొడుల రాజ్యం వస్తుందని కేసీఆర్ చెప్పారు. ధరణి ఉండాలా వద్దా మీరే చెప్పాలని కేసీఆర్ ప్రజలను కోరారు. ధరణి లేకపోతే పట్టా ఇవ్వడానికి ఆరు మాసాల సమయం పడుతుందన్నారు.
తెలంగాణ పథకాలు అమలు చేయాలనిమహారాష్ట్ర ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు. లేకపోతే తమను తెలంగాణలో కలపాలని పోరాటం చేస్తున్నారన్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ శాఖను ఏర్పాటు చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం చెబుతున్నారని కేసీఆర్ తెలిపారు. ప్రజల దీవెనతో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలన్నీ పేదలకు ప్రయోజనం చేకూరుస్తున్నాయన్నారు.
గతంలో వర్షాకాలంలో గిరిజనులు వ్యాధులతో సతమతమయ్యేవారని కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ప్రతి తండాను, గిరిజన గ్రామాలను అభివృద్ది చేసుకున్నామన్నారు. దీంతో గిరిజన గ్రామాల్లో మన్యం మంచం పట్టిందనే వార్తలు మీడియాలో రావడం లేదని కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథతో వ్యాధులు బాగా తగ్గిపోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందునే ఆసిఫాబాద్ ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకున్నట్టుగా కేసీఆర్ చెప్పారు.
also read:పోడు రైతులపై కేసులు ఎత్తివేస్తాం: గిరిజనులకు పోడు పట్టాలిచ్చిన కేసీఆర్
వార్ధానదిపై వంతెనకు నిధులను మంజూరు చేస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ చెప్పారు. ఆసిఫాబాద్ కు ఐటీఐ కాలేజీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. నాగమ్మ చెరువును పర్యాటక కేంద్రంగా అభివృద్దిచేస్తామన్నారు. కాగజ్ నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లను సీఎం మంజూరు చేశారు. 335 గ్రామపంచాయితీలకు రూ. 10 లక్షలను మంజూరు చేయనున్నట్టుగా సీఎం హామీ ఇచ్చారు.