
Bathukamma 2025: తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హైదరాబాద్ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రతిబింబిస్తూ స్టేడియం అంతా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈసారి వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా మిస్ వరల్డ్ 2025 విజేత ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ పాల్గొనడం విశేషం. మంత్రి సీతక్క, మేయర్ విజయలక్ష్మితో కలిసి సుచాతా బతుకమ్మ ఆడారు.
తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించిన మిస్ వరల్డ్, ఇతర విదేశీయులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు, ఆడపడుచుల బతుకమ్మల ఆటలతో స్టేడియం మారుమ్రోగిపోయింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో సాంప్రదాయ నృత్యాలు, పాటలు ప్రేక్షకులను అలరించాయి. తెలంగాణ సాంస్కృతిక ప్రత్యేకతను ప్రతిబింబించిన ఈ సంబరాల్లో మిస్ వరల్డ్ పాల్గొనడం మరింత ప్రత్యేకంగా మారింది.
వేదికపై 63 అడుగుల ఎత్తు, 11 అడుగుల వెడల్పుతో, 7 టన్నుల బరువుతో రూపొందించిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూలతో అలంకరించిన ఈ బతుకమ్మను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారు. ప్రకృతిని ఆరాధించే ఈ వేడుకలో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఈ వేడుకలో ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ క్రమంలోనే గిన్నిస్ రికార్డును కూడా సాధించారు. అతి పెద్ద జానపద నృత్యం (బతుకమ్మ ఆడి) గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఘనతతో మహిళా శక్తి, తెలంగాణ ఐక్యత ప్రపంచ వేదికపై వెలుగొందింది.
బతుకమ్మ ఉత్సవం ద్వారా తెలంగాణ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది:
1. అతి పెద్ద బతుకమ్మ (63 అడుగుల ఎత్తు)
2. అతి పెద్ద జానపద నృత్యం (1354 మంది మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు)
ఈ విజయంతో బతుకమ్మ పండుగ అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాధాన్యం పొందింది.
మంత్రి సీతక్క మాట్లాడుతూ, “మన బతుకమ్మ నేడు ప్రపంచ స్థాయిలో వెలుగొందింది. మహిళా శక్తి పట్టుదలతో ఏదైనా సాధించగలదని నిరూపించింది” అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బతుకమ్మ పండుగను పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఐక్యతకు ప్రతీకగా అభివర్ణించి శుభాకాంక్షలు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, “బతుకమ్మను ప్రపంచ వేదికపై పరిచయం చేయడం తెలంగాణ గర్వకారణం” అన్నారు.