
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమెకు మద్దతుగా బీఆర్ఎస్ నేత పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మేకింగ్‌లో కవిత పాత్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని అన్నారు. ఏ తప్పు చేయలేదు కనుకే ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొనేందుకు కవిత సిద్దమయ్యారని చెప్పారు. ఈ తప్పుడు ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఢిల్లీలో కవిత చేపట్టిన దీక్షకు దేశవ్యాప్తంగా మద్దతు లభించిందని అన్నారు.
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ రోజు ఉదయం 11 గంటల సమయంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో.. ఆమె ఇప్పటికే లీగల్ టీమ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం తెలంగాణ అడిషనల్ ఏజీ కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కేటీఆర్, హరీష్ రావులతో పాటు పలువురు తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు కవితకు మద్దతుగా ఇప్పటికే ఢిల్లీకి చేరకున్నారు. ప్రస్తుతం కవిత ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో బస చేస్తుండగా.. అక్కడికి భారీగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
మరోవైపు ఢిల్లీలోని ఈడీ కార్యాలయం వద్ద కూడా భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈడీ ఆఫీసు పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈడీ ఆఫీసు వద్దకు చేరుకోకుండా భారీగా భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని కవితకు ఈడీ సమన్లు జారీచేసింది. మహిళ రిజర్వేషన్లపై ఢిల్లీలో దీక్ష, ఇతర ముందస్తు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో 9వ తేదీన విచారణకు రాలేనని కవిత ఈడీకి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈరోజు(మార్చి 11)న విచారణకు హాజరయ్యేందుకు సిద్దమయ్యారు. ఇక, ఈరోజు విచారణ సందర్భంగా అరుణ్ రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.