బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

By narsimha lodeFirst Published Feb 6, 2024, 10:38 AM IST
Highlights

భారత రాష్ట్ర సమితికి షాక్ తగిలింది.  పెద్దపల్లి ఎంపీ  వెంకటేష్  కాంగ్రెస్ పార్టీలో చేరారు.

హైదరాబాద్: భారత రాష్ట్ర సమితికి చెందిన  పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతకాని   మంగళవారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి  కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి కే.సీ. వేణుగోపాల్ తో భేటీ అయ్యారు. కే.సీ వేణుగోపాల్ సమక్షంలో వెంకటేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2019 లోక్ సభ ఎన్నికలకు ముందు వెంకటేష్ నేత  కాంగ్రెస్ పార్టీ నుండి భారత రాష్ట్ర సమితిలో చేరారు. పెద్దపల్లి ఎంపీ సీటును అప్పట్లో బీఆర్ఎస్ వెంకటేష్ నేతకు కేటాయించింది. పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి  వెంకటేష్ నేత పోటీ చేసి విజయం సాధించారు. ఇవాళ  కే.సీ వేణుగోపాల్ సమక్షంలో వెంకటేష్ నేత  బీఆర్ఎస్‌ను వీడి  కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఈ ఏడాది  ఏప్రిల్ మాసంలో  పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో  పెద్దపల్లి ఎంపీ  వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎర్రవెల్లిలో  నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడ  వెంకటేష్ నేత హాజరయ్యారు.  అయితే ఇవాళ రేవంత్ రెడ్డితో కలిసి కే.సీ. వేణుగోపాల్ నివాసానికి  వెంకటేష్  వెళ్లారు. 


 2023  నవంబర్ మాసంలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన తర్వాత  పార్టీ నాయకత్వానికి  వెంకటేష్ కు కొంత గ్యాప్ ఏర్పడినట్టుగా చెబుతున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో  ఎమ్మెల్యేలదే పెత్తనం కావడంతో  ఆయన పార్టీ నాయకత్వం తీరుపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఇదే తరుణంలో వచ్చే ఎన్నికల్లో  పెద్దపల్లి ఎంపీ స్థానం నుండి బీఆర్ఎస్ నాయకత్వం వెంకటేష్ స్థానంలో మరొకరిని బరిలోకి దింపే అవకాశం కూడ లేకపోలేదనే ప్రచారం కూడ ప్రారంభమైంది. ఈ తరుణంలో  వెంకటేష్  ప్రత్యామ్నాయాన్ని వెతుకున్నారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

click me!