
కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం సహకరించకున్నప్పటికీ తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చారని.. అయితే తెలంగాణ విషయంలో కేంద్రం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నామా నాగేశ్వరరావు మాట్లాడారు. తెలంగాణ పట్ల మోదీ సర్కార్ వివక్ష చూపిస్తోందని విమర్శలు గుప్పించారు. విభజన చట్టం హామీలను నెరవేర్చాలని 9 ఏళ్లుగా కేంద్రాన్ని కోరుతునే ఉన్నామని చెప్పారు.
కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని ఎన్నోసార్లు అడిగామని.. కోచ్ ఫ్యాక్టరీలను గుజరాత్, మహారాష్ట్రకు ఇచ్చి తమకు రిపేర్ ఫ్యాక్టరీ ఇచ్చారని అన్నారు. చిన్న రాష్ట్రాల పట్ల మోదీ సర్కార్ తీరు సరిగా లేదని విమర్శించారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ కూడా దేశంలో భాగమే కదా? అని ఎంపీ నామా ప్రశ్నించారు.
తెలంగాణ పథకాలను కేంద్రం అనుసరిస్తోందని అన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా మంచినీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఇంటింటికి మంచినీరు ఇస్తోందా? అని ప్రశ్నించారు. హర్ ఘర్ జల్ పథకం కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని.. మిషన్ భగీరథకు రూ. 24 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా ఒక్క రూపాయి ఇవ్వలేదని అన్నారు. సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. దిగుబడిలో పంజాబ్‌ను తెలంగాణ అధిగమించిందని చెప్పారు. మణిపూర్ హింసాత్మక ఘటనలు దేశానికే సిగ్గుచేటు అని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు ఈ ఘటనలతో విదేశాల్లోనూ భారత్ పరువు మంటగలిసిందని అన్నారు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రానిదే అని నామా నాగేశ్వర్ రావు స్పష్టం చేశారు.