భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు రూ. 50 వేలు చెల్లించాలి: హైకోర్టులో ఎన్ఎస్‌యూఐ నేత వెంకట్ పిటిషన్

By narsimha lode  |  First Published Aug 9, 2023, 3:15 PM IST

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు  రూ. 50 వేల పరిహారం చెల్లించాలని  ఎన్ఎస్‌యూఐ నేత వెంకట్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు  ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


హైదరాబాద్:  వరదలు, వర్షాలపై తెలంగాణ హైకోర్టులో ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్ బుధవారంనాడు  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు  చేశారు. భారీ వర్షాల కారణంగా  మరణించిన మృతులకు  రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని ఆయన ఆ పిటిషన్ లో కోరారు. వరదల్లో  తీవ్రంగా నష్టపోయిన  రైతులకు రూ. 50వేలు చెల్లించాలని ఆ పిటిషన్ లో ఆయన కోరారు. 
దెబ్బతిన్న రోడ్లు, కాలువలకు  మరమ్మత్తులు చేయించాలని పిటిషనర్ కోరారు.  ఈ పిటిషన్ పై  రేపు విచారణ జరిగే అవకాశం ఉంది.

ఈ ఏడాది జూలై  మాసంలో  తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో  ప్రాణ, ఆస్తి నష్టం చోటు  చేసుకుంది.  గోదావరి పరివాహక ప్రాంతంలోని పలు జిల్లాల వాసులు తీవ్రంగా నష్టపోయారు.  ఈ విషయమై  ఇప్పటికే  తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పై విచారణ సాగుతుంది.  తాజాగా ఎన్ఎస్‌యూఐ నేత బల్మూరి వెంకట్  పిటిషన్ దాఖలు చేశారు.

Latest Videos

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలపై జరిగిన నష్టంపై  కేంద్ర బృందం  మూడు రోజుల పాటు పర్యటించింది. రాష్ట్రంలో  జరిగిన  నష్టంపై  కేంద్రానికి  ఈ బృందం  నివేదికను అందించింది.  మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి  నష్టం వివరాలను  సేకరిస్తున్నారు.   భారీ వర్షాలతో సత్వర సహాయం కోసం  రూ. 500 కోట్లను  ప్రభుత్వం విడుదల చేసింది.  ఇటీవల ముగిసిన  తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కూడ  ఈ విషయమై చర్చ జరిగింది.నష్టపోయిన వారిని ఆదుకొనే చర్యలు తీసుకుంటున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

click me!