గవర్నర్ల తీరుపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ ఎంపీలు కోరారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయాన్ని లేవనెత్తారు.
న్యూఢిల్లీ:గవర్నర్ల తీరుపై పార్లమెంట్ లో చర్చ జరగాలని తాము కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆల్ పార్టీ సమావేశంలో కోరినట్టుగా బీఆర్ఎస్ ఎంపీ కె. కేశశరావు చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం సోమవారం నాడు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసింది.ఈ సమావేశంలో బీఆర్ఎస్ తరపున కేశవరావు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తాము ప్రస్తావించిన అంశాలను బీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు ఇవాళ మీడియాకు తెలిపారు.
గవర్నర్ల వ్యవస్థపై పార్లమెంట్ లో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్ ను ఆమోదించాలని కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. తమ బడ్జెట్ ను ఆమోదించుకోవడం కోసం ప్రభుత్వాలు కోర్టుకు వెళ్లేలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారని కేశవరావు మండిపడ్డారు. రాజ్యాంగంలో అనేక అవకాశాలున్నప్పటికీ బడ్జెట్ కు గవర్నర్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారని కేశవరావు విమర్శించారు. బడ్జెట్ పాస్ కాకపోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి వస్తుందన్నారు. బడ్జెట్ పాస్ కాకపోతే ప్రభుత్వం నడవదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో గవర్నర్ల వ్యవస్థపై చర్చ జరగాలని తాము అఖిలపక్ష సమావేశంలో కోరినట్టుగా కేశవరావు చెప్పారు.
కేరళ రాష్ట్రంలో ప్రభుత్వానికి గవర్నర్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందన్నారు. తమిళనాడులో కూడా ఇదే రకమైన పరిస్థితి ఉన్న విషయాన్ని కేశవరావు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు , ప్రభుత్వానికి మధ్య చాలా కాలంగా గ్యాప్ నెలకొంది. ప్రభుత్వ తీరుపై గవర్నర్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారంగా వ్యవహరించడం లేదని కూడా ఆమె మండిపడుతున్నారు. రాజ్ భవన్ కు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలని తమిళిసై కోరుతున్నారు.
మరో వైపు గవర్నర్ తీరుపై ప్రభుత్వం సీరియస్ గా వ్యాఖ్యలు చేస్తుంది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తన వద్ద పెట్టుకోవడంపై తెలంగాణ సర్కార్ విమర్శలు గుప్పిస్తుంది. ఈ విషయమై మంత్రులు, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన విమర్శలపై బీజేవైఎం నేతలు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.
also readLదిగొచ్చిన కేసీఆర్ సర్కార్: బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం, లంచ్ మోషన్ పిటిషన్ ఉపసంహరణ
రిపబ్లిక్ డే ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వమే పరేడ్ తో రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహించాలని ఈ నెల 25న తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజ్ భవన్ లోనే రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదనే విమర్శలు వ్యక్తమ ౌతున్నాయి. ఈ పరిణామాలపై గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది.