
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఉదయం 11 గంటలకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే కవిత ఢిల్లీలో వున్న సంగతి తెలిసిందే. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ఈరోజు కవిత ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్ష నిర్వహించారు. దీక్ష ముగిసిన అనంతరం కవిత న్యాయ నిపుణులతో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు.
మరోవైపు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ సీనియర్ నేత, మనీష్ సిసోడియాకు న్యాయస్థానం ఏడు రోజుల ఈడీ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మనీష్ సిసోడియా రిమాండ్ రిపోర్టులో ఈడీ కీలక విషయాలు ప్రస్తావించింది. రిమాండ్ రిపోర్టులో మరోసారి కవిత పేరు ప్రస్తావించింది. సౌత్ లాబీపై పలు విషయాలను పేర్కొంది. సౌత్ గ్రూప్‌లో రామచంద్ర పిళ్లై, సమీర్ మహేంద్రు , మాగుంట శ్రీనివాసులు రెడ్డికి 65 శాతం వాటా వుందని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ మొత్తం 9 జోనులను కైవసం చేసుకుందని.. ఢిల్లీ లిక్కర్ స్కాం హైదరాబాద్‌లోనే జరిగిందని ఈడీ పేర్కొంది. ఐటీసీ కోహినూర్ హోటల్‌లో కుట్ర జరిగిందని ఈడీ ప్రస్తావించింది.
Also REad: రేపు కవితను అరెస్ట్ చేయవచ్చు : కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఇండో స్పిరిట్‌లో పెట్టుబడులపై రామచంద్రపిళ్లై స్టేట్ మెంట్ ఇచ్చాడని.. ఇండో స్పిరిట్‌లో బినామీ పెట్టుబడులు వున్నట్లుగా పేర్కొన్నారని ఈడీ వెల్లడించింది. సౌత్ గ్రూప్‌కు సంబంధించిన లాబీని బుచ్చిబాబు చూస్తున్నాడని పేర్కొంది. సౌత్ గ్రూప్ నుంచి రూ100 కోట్లకు పైగా ముడుపులు వెళ్లాయని.. వైసీపీ ఎంపీ మాగుంటతో కలిసి సౌత్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఈడీ తెలిపింది. సౌత్ గ్రూప్ వ్యవహారంలో ఆప్ నేత విజయ్ నాయర్‌ది కీలకపాత్రని వెల్లడించింది. సౌత్ గ్రూప్ లాబీపై పలు విషయాలను ప్రస్తావించింది ఈడీ. సౌత్ గ్రూప్ మొత్తం 9 జోన్లను కైవసం చేసుకుందని.. గోరంట్ల బుచ్చిబాబు హవాలా రూపంలో డబ్బులు ఢిల్లీకి తరలించారని వెల్లడించింది.
కవితకు 33 శాతం వాటా ఇస్తామని వీరు చాటింగ్ చేసుకున్నారని ఈడీ తెలిపింది. వీ పేరుతో విజయ్ నాయర్, మేడమ్ పేరుతో కవిత వ్యవహరించారని పేర్కొంది. Samee పేరుతో సమీర్ చాటింగ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. మరోవైపు రేపటి కవిత ఈడీ విచారణ సందర్భంగా మరో ఏడుగురికి నోటీసులు జారీ అయ్యాయి. రేపటి నుంచి వారం పాటు ఏడుగురిని విచారించనున్నారు ఈడీ అధికారులు. అభిషేక్ సోదరుడితో పాటు విజయ్ నాయర్ ఫ్రెండ్, సిసోడియా వ్యక్తిగత సిబ్బందికి నోటీసులు ఇచ్చింది ఈడీ.
Also REad: సిసోడియా ఈడీ రిమాండ్ రిపోర్ట్‌లో మరోసారి కవిత పేరు.. హైదరాబాద్‌లోనే స్కాం, ఈ పేర్లతో ఛాటింగ్
ఇకపోతే.. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు కవితను అరెస్ట్ చేసే అవకాశం వుందని.. చేసుకుంటే చేసుకోనీ అంటూ వ్యాఖ్యానించారు. మహా అయితే జైల్లో పెడతారని.. దీనికి భయపడేది లేదని, పోరాడదామని ఆయన పార్టీ నేతలతో అన్నారు. బీజేపీలో చేరని వారిని వేధిస్తున్నారని.. కవితను కూడా చేరమన్నారని సీఎం పేర్కొన్నారు. అటు మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరారు. రేపు, ఎల్లుండి ఆయన అక్కడే వుండి.. న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.